కేంద్ర కేబినెట్‌లోకి కొత్త ముఖాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం ముహూర్తం ఖరారవడంతో పదవుల కోసం నిరీక్షిస్తున్న ఆశావహుల్లో క్షణక్షనానికి ఉత్కంఠ పెరుగుతోంది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకున్న జరుగనున్న అతిపెద్ద మంత్రివర్గ విస్తరణ ఇదే అవడం వల్ల ఇప్పుడు పదవి దక్కకపోతే మరో టర్మ్ వరకు పదవి దక్కదని ఆశావహులు భావిస్తున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణనకు పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు పది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషికి కొత్త కేబినెట్‌లో చోటు దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ ఠాకూర్ లేదా మాజీ ముఖ్యమంత్రి పీకే ధుమాల్‌లో ఒకరిని పదవి వరించనుంది. ఉమాభారతి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీసీ నాయకుడు ప్రహ్లాద్ పటేల్‌కు కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ నుంచి ఓపీ మాథూర్ కేబినెట్‌కు రంగంలో ఉన్నారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకోకూడదంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
కేబినెట్ విస్తరణలో వ్యక్తుల ప్రతిభా పాటవాలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రాంతీయ సమతౌల్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలను దష్టిలో పెట్టుకోవడంతోపాటు ఇటీవల ఎన్డీయే కూటమిలో చేరిన కొత్త మిత్ర పక్షాలకు కూడా చోటు కల్పించాల్సి ఉంటుంది. నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్–యూ కూటమిలో చేరినందున ఆ పార్టీ నుంచి ఆరీసీపీ సింగ్, అఖిల భారత అన్నా డిఎంకె నుంచి వి. మైత్రేయన్, ఎం. తంబిదురైలకు కేబినెట్‌లోకి అవకాశం లభించవచ్చు. ఇక మనోహర్ పర్రీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే శాఖకు రాజీనామా చేస్తానని సురేశ్ ప్రభు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరి స్థానాలను కూడా మోదీ ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. పర్రీకర్ నిర్వహించిన కీలకమైన రక్షణ శాఖను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతగా ప్రస్తుతం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇంతటి కీలకమైన రక్షణ శాఖను ఎవరికి అప్పగిస్తారా? అన్న అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ నెలకొనే ఉంది. ఇక సురేశ్ ప్రభు స్థానంలో కేంద్ర రైల్వే శాఖను ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న గడ్కారీకి ఇవ్వొచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి.