గాంధీనగర్ : బుల్లెట్ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించే వారందరూ ఎద్దుల బండిపై ప్రయాణం చేయాలని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్-ముంబైల మధ్య జపాన్ సహకారంతో లక్షా పదివేల కోట్లతో నిర్మించతలపెట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా, అది సాధ్యం కాలేదని మోదీ అన్నారు. ఇప్పుడు జనతా ప్రభుత్వం ప్రాజెక్టు ప్రారంభించడంతో దాన్ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. అతి తక్కువ మొత్తానికి ప్రాజెక్టును తీసుకురావడంతో కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అన్నారు.
బుల్లెట్ ట్రైన్ కారిడార్ వల్ల గుజరాత్‌లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. ప్రాజెక్టుకు వాడే ముడి సరుకు మొత్తాన్ని జపాన్ భారత్ నుంచే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని పెద్దలకు గుజరాత్‌తో సంబంధాలు ఉన్నా.. రాష్ట్రానికి చేసిందని శూన్యమని చెప్పారు. కనీసం ఫెర్రీ సర్వీసులను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో రాష్ట్రం ఆనందమయంగా ఉందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి సాధిస్తుందని అన్నారు.
గుజరాత్ తీర రేఖ పొడవునా 1300 దీవులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సింగపూర్ కంటే గొప్పగా తీర్చిదిద్దాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మోదీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment