
మోదీ మ్యాజిక్ ఏమైంది?
ముంబై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్సాహంగా ఉన్న బీజేపీపై మిత్ర పక్షం శివసేన మరోసారి విమర్శలు చేసింది. అస్సాంలో బీజేపీ విజయం సాధించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ అనుకుంటే మరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందని అధికార పత్రిక 'సామ్నా'లో ప్రశ్నించింది.
ప్రాంతీయ పార్టీలపై గెలుపొందడం అంత సులువుకాదన్న విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని తెలిపింది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీపై గెలుపొందారని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోని ప్రాంతీయ పార్టీల కంచుకోటలను తాకలేకపోయారని పేర్కొంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడిన ప్రజలు, అచ్చేదిన్ ప్రభుత్వానికి ఒక్క సీటును మాత్రమే ఇచ్చారని 'సామ్నా'లో విమర్శించింది.