ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో ఏం సాధించారని, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో ఏం సాధించారని, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఈ రెండేళ్ల పాలనే అత్యంత దారుణమైన పాలన అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లు వాగ్దానాలతోనే సరిపెట్టారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కావడం లేదన్నారు. ఆర్ధికాభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగాల కల్పన, మొదలైన విషయాలలో మోదీ సాధించినదేమీ లేదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రకటనలతోనే ప్రభుత్వాలను నడిపిస్తున్నారని, చర్చకు రావడానికి సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ నేత సవాల్ విసిరారు.
దమ్ముంటే మీ క్యాబినెట్ లోని ఏ మంత్రయినా సరే రెండేళ్ల పాలనపై చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీకి అసలు పోలికే లేదన్నారు. మన్మోహన్ మాటలు చెప్పే రకం కాదు.. కేవలం చేతల మనిషి అని, అయితే మోదీ మాత్రం మాటలకోరు.. చేతల్లో ఆయన శూన్యమని వ్యాఖ్యానించారు. అంతేందుకు కనీసం మీ నియోజకవర్గం వారణాసి అయినా సరిగా ఉందా, రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశారా.. యువతకు ఉద్యోగాలు కల్పించారా అని మోదీ పాలనపై సిబల్ తీవ్రంగా మండిపడ్డారు.