
ఆర్థిక పరిస్థితిపై మోదీకి అవగాహన లేదు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్
లక్నో: దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీకి సరైన అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. పెద్ద నోట్లు రద్దవడంతో పేదలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే మోదీ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. నల్లధనాన్ని అరికట్టడంలో మోదీ తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. పేద ప్రజల దగ్గరున్న పెద్ద నోట్లను కూడా మోదీ నల్లధనంగా భావిస్తున్నారని మండిపడ్డారు.
నోట్ల రద్దు వెనుక రాజకీయ కోణం దాగి ఉందని ఆరోపించారు. భారత్‌లో 125 కోట్ల మంది ప్రజలు ఉండగా, వారిలో 60 కోట్ల మందికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, అందులో 32 కోట్ల మంది ఖాతాల్లో కొన్ని సంవత్సరాల నుంచి అసలు లావాదేవీలే జరగడం లేదని గణాంకాలతో వివరించారు. స్విస్ బ్యాంక్‌లో ఖాతాలున్న భారతీయు ల వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.