ఓటమిని ఒప్పుకున్నాయి
విపక్షాలపై గోవా ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్య
పణజి: కేంద్ర బడ్జెట్, ఎన్నికల తేదీలు వంటి చిన్న అంశాలపై కాకుండా అభివృద్ధి అంశంపై ఎన్నికల్లో పోరాడాలని ప్రధాని మోదీ విపక్షాలకు సవాల్ విసిరారు. విపక్షాలు ఇప్పటికే ఓటమిని అంగీకరించాయన్నారు. శనివారం పణజీలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘బడ్జెట్‌ను ముందుకు జరపటంపై విపక్షాలు విమర్శించడానికి.. బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రి చేస్తున్న కృషికంటే ఎక్కువ కష్టపడుతున్నాయి. బడ్జెట్‌కు వ్యతిరేకంగా పత్రాలను రాసివ్వాలని ఆర్థికవేత్తలను అడుగుతున్నాయి. ఎన్నికల్లో అవి ఓటమిని అంగీకరించాయనేందుకు ఇదో సంకేతం.
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఓకే రోజు(ఫిబ్రవరి 4)న నిర్వహించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. అంటే ఓడిపోయాక ఎన్నికల సంఘం తగిన రోజున ఎన్నికలు జరపలేదని ఆరోపిస్తాయి. ఇలాంటి వాటిపైనా ఎన్నికల్లో పోరాడాల్సింది?’ అని ప్రశ్నించారు. ప్రజలు తెలివైనవారని, అందుకే కాంగ్రెస్ అన్నిచోట్లా ఓడిపోతోందని, తెలివైన గోవా ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు. తమను తగినంత మెజారిటీతో గెలిపిస్తే రాష్ట్రాన్ని దేశంలోకెల్లా సౌకర్యవంతమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. గోవాకు కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లలో ఇచ్చినదానికంటే గత 25 నెలల్లో తమ ప్రభుత్వమే ఎక్కువగా ఇచ్చిందన్నారు. దృఢమైన రక్షణ మంత్రి పరీకర్‌ను అందించిన గోవాకు ధన్యవాదాలన్నారు. ప్రపంచమంతా సర్జికల్ దాడుల గురించే చర్చ అన్నారు.
యువశక్తిని చూసి గర్వపడుతున్నా
న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి యువశక్తే మూలమని, భారతీయ యువశక్తిని చూసి గర్వపడుతున్నా నన్నారు. శనివారం నేషనల్ కేడెట్ కోర్ (ఎన్ సీసీ) ర్యాలీలో మాట్లాడుతూ.. ఐకమత్యమే భారతీ యుల బలానికి పునాదిరాయి అని పేర్కొన్నారు. విభిన్న ప్రాంతాలూ, అనేక భాషలు, మాండలికాలు, భిన్న ఆచారాలు ఉన్నప్పటికీ భారతీయులు ఎలా ఐక్యంగా ఉండగలుగుతు న్నారని ప్రపంచం అచ్చెరు వొందుతోందన్నారు.