
నేనే కొన్నా.. నా భర్తకు సంబంధం లేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: హర్యానాలో తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి తన భర్త రాబర్ట్ వాద్రా డబ్బులు ఇవ్వలేదని, ఆ భూమికి తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రియాంక కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. హర్యనాలోని ఫరిదాబాద్‌లో ప్రియాంక వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని, దానికి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్‌ఎఫ్ సంస్థల నుంచి డబ్బులు వచ్చాయంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తన భర్త నుంచి ఒక్క రూపాయి కూడా ఆ భూమి కొనుగోలుకు రాలేదని ఆమె చెప్పారు. తాను చెక్ ద్వారా 5 ఎకరాల భూమిని రూ.15లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత అదే భూమిని అదే యజమానికి 2010 ఫిబ్రవరి 17న మార్కెట్ ధరల ప్రకారం రూ.80లక్షలకు అమ్మినట్లు చెప్పారు. అది కూడా చెక్ ద్వారానే స్వీకరించినట్లు తెలిపారు. తన భర్తనే ఆ భూమి కొనుగోలు చేశాడంటూ వచ్చిన వార్తలన్నీ కూడా బూటకాలని, ఆధారం లేనివని చెప్పారు.