- సంప్రదాయ వైద్య విధానాలకు ప్రోత్సాహం
- బడ్జెట్‌లో రూ.1,214 కోట్ల కేటాయింపు
- దేశంలో కొత్తగా ఆరు ఎయిమ్స్‌లు
- ఆరోగ్యశాఖకు తగ్గిన నిధులు
- కిందటేడాది రూ.35,163 కోట్లు.. ఈసారి రూ.33,150 కోట్లు
న్యూఢిల్లీ: ఆరోగ్య శాఖపై బడ్జెట్‌లో కాస్త చిన్నచూపు చూసిన కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖకు మాత్రం పెద్దపీటే వేసింది! కిందటిసారితో పోలిస్తే ఆరోగ్యశాఖకు కేటాయింపులను స్వల్పంగా(5.7 శాతం) తగ్గించారు. 2014-15 బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.35,163 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.33,150 కోట్లతో సరిపుచ్చారు. ఇక దేశీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించే దిశగా ఆయుష్(ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖకు రూ.1,214 కోట్లు ప్రతిపాదించారు. ఇన్నాళ్లూ ఆరోగ్య శాఖలో భాగంగా ఉన్న ఆయుష్‌ను మోదీ ప్రభుత్వం కిందటేడాదే ప్రత్యేక శాఖగా విడదీసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, అస్సాం, తమిళనాడులో కొత్తగా ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)లు, బిహార్‌లో ఎయిమ్స్ తరహా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
ఆరోగ్య శాఖ పరిధిలోని హెల్త్ రీసెర్చ్ విభాగానికి కిందటేడాదితో పోలిస్తే 9.2 శాతం అధికంగా నిధులు కేటాయించారు. కిందటి బడ్జెట్‌లో దీనికి రూ.932 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.1,018.17 కోట్లు ప్రతిపాదించారు. ఇక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.29,653 కోట్లు (కిందటిసారి రూ.29,042) కేటాయించారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగానికి కిందటిసారితో పోలిస్తే 7.4 శాతం నిధులు పెంచుతూ రూ.1,397 కోట్లు కేటాయించారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌కు కింద టిసారి రూ.1,565 కోట్లు కేటాయించగా.. 2015-16కుగాను రూ.1,470 కోట్లు ప్రతిపాదించారు. 2,200కుపైగా పడకల సామర్థ్యం గల ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రతిరోజూ 8 వేల మంది రోగులకు చికిత్స అందిస్తారు. ఎయిమ్స్ పక్కనే ఉన్న సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి బడ్జెట్‌లో రూ.520 కోట్లు కేటాయించారు. రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి కిందటిసారి రూ.322.77 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు రూ.650కోట్లు కేటాయించారు.
సముచిత కేటాయింపులు: ఆరోగ్య మంత్రి నడ్డా
ఆరోగ్యరంగానికి బడ్జెట్లో సమతుల కేటాయింపులు జరిపారని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘ఇది ప్రజానుకూల, పురోగమన బడ్జెట్. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఆరోగ్య రంగానికి సముచిత కేటాయింపులు చేశారు’ అని అన్నారు. ‘ఎయిమ్స్‌ల ఏర్పాటుతో ఆయా రాష్ట్రాలు, పొరుగు ప్రాంతాల్లో మరిన్ని ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్థలను మా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. తాజా బడ్జెట్‌లో పేర్కొన్నట్టుగా 6 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తే దేశంలో వీటి సంఖ్య 14కు చేరనుంది. కాగా, బడ్జెట్‌లో ఫార్మా రంగాన్ని విస్మరించారని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. జైట్లీ సమతుల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆరోగ్యరంగం కోణంలో చూస్తే ఆయన చేసిన కేటాయింపులు సరిపోవని అపోలో ఆస్పత్రుల చైర్మన్ పీసీ రెడ్డి పేర్కొన్నారు.