ఆమె లేదు.. అయినా పుట్టినరోజు వేడుక ఆగలేదు
మర్చిపోవడానికి ఆమె జ్ఞాపకం కాదు.. 42 ఏళ్లు కొనసాగిన అనుబంధం.. అంతకుమించి ప్రాణంపదం. అందుకే దివంగత అరుణా షాన్బాగ్ పుట్టినరోజు వేడుకల్ని సోమవారం ఘనంగా నిర్వహిచారు ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సులు, డాక్టర్లు. వార్డుబాయ్ చేతిలో తీవ్ర లైంగిక హింసకు గురై, 42 ఏళ్లపాటు ఎలాంటి కదలికలు లేకుండా అరుణ జీవించిన నాలుగో నంబర్ గదిని నర్సులు అందంగా అలంకరించారు.
ఉదయం నుంచి వరుసగా ఆ గదికి వచ్చిన నర్సులు.. బెడ్పై పూలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తరువాత కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చికిత్స సమయంలో అరుణను ఉంచిన 4వ నంబర్ గదికి ఆమె పేరు పెట్టాలని నర్సులు కోరుతున్నట్లు, తర్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేఈఎం ఆసుపత్రి డీన్ అవినాష్ సుపే తెలిపారు.
థానేలోని నర్సింగ్ కళాశాలకు అరుణ షాన్బాగ్ పేరు పెట్టనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, అరుణ జీవితగాథ ఆధారంగా జర్నలిస్ట్ నేహా పురవ్ రూపొందించిన మరాఠి చిత్రం 'వ్యథ అరుణాచి' ఈ సాయంత్రం విడుదల కానుంది.