ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో వణుకుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు కష్టాలు పడుతున్నారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లపాలయ్యారు. దాదర్, చెంబూర్, సైన్, వర్లీ, లోయర్ పరేల్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు లోకల్ రైళ్లు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుతురు మందగించడంతో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సలహాలు పాటించాలని, ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుంటే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. ట్విటర్ ద్వారా సమాచారం అందించినా అధికారులు స్పందిస్తారని తెలిపారు. సహాయం కావాల్సిన వారు 100 నంబర్ ద్వారా తమను సంప్రదించాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా తలత్తిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు.
ఇతర సహాయక నంబర్లు
ముంబై పోలీస్ వైర్‌లెస్: 22633319
బీఎంసీ హెల్ప్‌లైన్: 1916
బీఎసీ ల్యాండ్‌లైన్: 22694719
సివిల్ డిఫెన్స్: 22856435
ట్రాఫిక్ హెల్ప్‌లైన్: +91-8454999999
ఎంసీజీఎం హెల్ప్‌లైన్: +91-22-22694725