పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న బీహార్ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. గురువారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇది పూర్తయితే, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్లే. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికలు ఒక ఎత్తుకాగా, ఈ ఐదో దశ మాత్రం మరోఎత్తు. ఎందుకంటే, గురువారం ఎన్నికలు జరగనున్న 57 నియోజవర్గాలు కూడా ముస్లింల, యాదవుల హవా ఉన్న ప్రాంతాలు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ది కూడా యాదవుల సామాజిక వర్గం కావడంతో మిగితా నియోజవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఈ నియోజవర్గాల్లో మాత్రం మోదీ హవా కన్నా నితీశ్, లాలూ హవా కొనసాగే అవకాశం ఉంది. పైగా దేశ వ్యాప్తంగా మోదీ ప్రభావం ఉన్న సమయంలోనే ఇక్కడ బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి చతికిలపడింది. ఇప్పటికే ఓ వ్యూహం ప్రకారమే ముస్లిం వ్యతిరేక చర్యలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని దేశ వ్యాప్తంగా నిరసనలు రచ్చకెక్కడం కూడా బీజేపీకి కొంత ప్రతికూలంగా ఉన్న అంశం.
మరోపక్క, తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ తమ పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టి బీజేపీపై ముస్లింలకు ఉన్న వ్యతిరేకతను తమకు ఓట్లుగా మార్చుకునే దిశగా ముందడుగులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికంతో నిండిఉండటమే కాకుండా వలసదారులు కూడా అధికమే.
సిమాంచల్, కిషన్ గంజ్, పుర్నియా, ఖతిహార్, అరేరియాలో ఎక్కువగా ముస్లింలు ఉండగా, మదిపురా, సహస్రాలో ఎక్కువగా యాదవులు ఉన్నారు. ముస్లింలు, యాదవులు మాత్రమే ఈ నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తారని ప్రముఖ రాజకీయ వేత్త మహేందర్ యాదవ్ కూడా అన్నారు. దీంతో మొత్తం ఏడు జిల్లాల్లో జరగనున్న తుది పోరులో ఓటర్లు ఏ పార్టీల అభ్యర్థిని పలకరిస్తారనేది తెలుసుకునేందుకు ఫలితాలు వెల్లడయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.
ఇక మిగిలింది ముస్లిం, యాదవుల చేతిలోనే!
Published Wed, Nov 4 2015 5:10 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement