గౌహటి : వరదలతో అతలాకుతలం అయిన అసోంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. అధికారులతో సమావేశమై నష్టనివారణ చర్యల గురించి విశ్లేషిస్తున్నారు. ఇటీవల అసోంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో 76 మంది మృతి చెందగా, సుమారు 2వేల 939 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వరదలు బీభత్సం సృష్టించిన రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని ఇప్పటికే ప్రధాని మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.
అలాగే ప్రధాని నిన్న అసోం వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు అసోంలో వరదలు, నష్ట నివారణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్తో ప్రధాని సమీక్షించనున్నారు. కాగా అధికారుల లెక్కల ప్రకారం 29 జిల్లాల్లో 25 లక్షల మంది వర్షాలు, వరదల బారిన పడ్డారు.