లక్నో: రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ‘డిఫెక్స్‌పో’ను బుధవారం ఇక్కడ ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు. భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు ఈ సంవత్సరం 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు. సొంత దేశ రక్షణే కాకుండా ప్రధాన సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పొరుగు దేశాలకు సహకారం అందించడం కూడా భారత్ బాధ్యతగా భావిస్తుందన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు భారత్ దోహదపడుతుందన్నారు. మిలటరీ ఉత్పత్తుల విషయంలో దిగుమతులను తగ్గించుకుని, దేశీయ తయారీని పెంచే దిశగా తమ ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment