
మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ ప్రచారం
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుండటంతో.. పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుండటంతో.. పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారం చేయనున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో శివసేనతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో బీజేపీ విజయం కోసం నేరుగా ప్రధానమంత్రే ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఆయన దాదాపు 24 ర్యాలీలు నిర్వహిస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా విజయం సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.
అయితే.. ఈసారి మహారాష్ట్రలో చతుర్ముఖ పోటీ ఉంది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దాంతో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. మహారాష్ట్రలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మోడీ ప్రభావంతో బీజేపీ భారీ స్థాయిలో విజయాలు సాధించింది. దాంతో ఇప్పుడు కూడా అదే గాలి ప్రభావంతో ఈదుకు రావాలని కమలనాథులు భావిస్తున్నారు.
దాంతో అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే ప్రధానమంత్రి మోడీ మహారాష్ట్ర ఎన్నికల మీద దృష్టి సారించాలని భావిస్తున్నారు. ముందుగా ఆయన ముంబై, కొల్హాపూర్ నగరాల్లో ర్యాలీలు ప్రారంభిస్తారు. జాతీయస్థాయిలో లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటించడం, ఎన్నికల ప్రచారం చేయడం ఇదే తొలిసారి అవుతుంది.