సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌లో ఉన్న బీజేపీ ఆశించిన సీట్లు దక్కకపోవడంపై మాత్రం అసంతృప్తితో రగులుతూనే ఉంది. ఈ పరిణామం వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే గుబులు కమలనాధుల్లో వ్యక్తమవుతోంది. గుజరాత్ అసెంబ్లీలో 100లోపు స్ధానాలకే బీజేపీ పరిమితం కావడంతో గుజరాత్ నుంచి అన్ని రాజ్యసభ స్ధానాలను నిలుపుకోవడం ఆ పార్టీకి సంక్లిష్టంగా మారింది.
గుజరాత్ నుంచి బీజేపీ నుంచి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరి పదవీకాలం 2018 ఏప్రిల్ 2న ముగుస్తుంది. గుజరాత్ అసెంబ్లీలో ఆ పార్టీకి 99 మంది సభ్యులుండటంతో బీజేపీ రెండు సీట్లను మాత్రమే (ఒక్కో రాజ్యసభ స్ధానానికి 36 మంది ఎమ్మెల్యేలు) నిలబెట్టుకునే అవకాశం ఉంది. మిగిలిన రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పరమవనున్నాయి. ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 11 మంది సభ్యుల్లో తొమ్మిది మంది బీజేపీకి చెందినవారే.
వచ్చే ఏడాది జరిగే ద్వైవార్షిక ఎన్నికల అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఏడుకు పడిపోనుంది. అయితే యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన విజయాలతో బీజేపీ రాజ్యసభలో తన సభ్యుల సంఖ్యను పెంచుకోనుంది. యూపీ నుంచి ఏడు సీట్లు, మహారాష్ట్ర నుంచి రెండు సీట్లను గెలుపొంది ఎన్‌డీఏ తన రాజ్యసభ సభ్యుల సంఖ్యను 84 నుంచి దాదాపు 100 సీట్లకు పెంచుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment