సోనియా, రాహుల్‌కు ఎదురుదెబ్బ
► యంగ్ ఇండియన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
► నేషనల్ హెరాల్డ్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
► తొలుత ఆదాయపన్ను శాఖను సంప్రదించాలని సూచన
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా ఆదాయ పన్ను(ఐటీ) శాఖ చేపట్టిన దర్యాప్తును నిలుపుదల చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని, దానిని ఉపసంహరించుకుని ఐటీ అస్సెసింగ్ అధికారిని సంప్రదించాలని జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.
ఐటీ అస్సెసింగ్ అధికారి లేవనెత్తిన ప్రశ్నలకు యంగ్ ఇండియన్ కంపెనీ సమధానం ఇవ్వలేదని, అస్సెస్‌మెంట్ అధికారినీ కంపెనీ కలవలేదని, అందువల్ల ముందు ఐటీ శాఖను సంప్రదించి.. అవసరమైన పత్రాలు అందించాలని సూచించింది. ఆ తర్వాతా సంతృప్తి చెందనట్లయితే కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. యంగ్ ఇండియన్ తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పడంతో.. ధర్మాసనం అందుకు అంగీకరించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రీ అస్సెస్‌మెంట్ నోటీసులను కొట్టివేయాలని, ఐటీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ యంగ్ ఇండియన్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.
అసలేం జరిగింది..
నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన షేర్లను 2010లో రూ. 50 లక్షల మూలధనంతో ఏర్పాటైన యంగ్ ఇండియన్ కంపెనీ సొంతం చేసుకుంది. ఐటీ శాఖ రికార్డుల ప్రకారం.. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్‌కు 83.3 శాతం, వోరాకు 15.5 శాతం.. ఫెర్నాండెజ్‌కు మిగతా 1.2 శాతం వాటా ఉంది. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ చెల్లించాల్సిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియన్‌కు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందులో సోనియా, రాహుల్‌తో పాటు మోతీలాల్‌వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను వారు తోíసిపుచ్చారు. స్వామి పిటిషన్‌పై దర్యాప్తు జరిపిన ఐటీ శాఖ.. ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియన్‌కు బదిలీ చేయడంలో దుర్వినియోగం జరిగిందని, ఇందులో రాహుల్, సోనియా పాత్ర ఉందని పేర్కొంటూ గతంలో నోటీసులు జారీ చేసింది.