National Herald Case: వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని 50 లక్షలకే సొంత చేసుకొని.. పన్ను కట్టమంటే అసలు ఆ అవసరమే లేదని వాదిస్తే ఏమనాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. ట్రిబ్యునల్‌కు వెళ్లి మరీ తమది డొల్ల వాదనని చెప్పించుకొని గతుక్కుమన్నారు సోనియా, రాహుల్ గాంధీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎవరిది? కోట్లాది మంది కార్యకర్తలది కాదా? మహాత్మా గాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులతో పాటు నెహ్రూ, పటేల్ వంటి మహామహులది కాదా? కేవలం సోనియా, రాహుల్ గాంధీదేనా? ఏమో!! కాంగ్రెస్ ఆస్తులు వారిద్దరికే చెందుతాయన్న రీతిలో జరిగిన ‘నేషనల్ హెరాల్డ్– యంగ్ ఇండియా’ డీల్‌ను చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. రూ.50 లక్షలతో దర్జాగా వేల కోట్లు సొంతం చేసుకోవడం.. అదీ ఆస్తుల రూపంలో సామాన్యుడికి ఎవరికైనా సాధ్యమేనా! రాహుల్ బాబా (గాంధీ)కి అది చిన్న పనే. స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజోపయోగం కోసం ఏర్పడ్డ ఓ సంస్థకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. కాలక్రమంలో రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలూ భారీ ఆస్తులు కట్టబెట్టాయి.
2008 నాటికే వాటి విలువ మార్కెట్ అంచనాల ప్రకారం రూ.5 వేల కోట్లు దాటేసింది. ఇప్పుడెంతో ఊహించటం కష్టమే. అలాంటి సంస్థ నష్టాల్లో కూరుకుపోతే దానికి కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. కాకపోతే ఆ రుణాన్ని అది తీర్చలేదని భావించి... కాంగ్రెస్ పార్టీయే 94 శాతాన్ని మాఫీ చేసేసింది. మిగిలిన 6 శాతం... అంటే రూ.50 లక్షల్ని సోనియా, రాహుల్‌కు చెందిన సొంత కంపెనీ చెల్లించి...ఆ ఆస్తులన్నీ తన ఖాతాలో వేసేసుకుంది. ఇదీ కథ.137 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ చరిత్రలోని మలుపుల కన్నా ఆసక్తికరమైన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌పై 5 రోజుల కిందటే ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తీర్పునిచ్చింది.
సదుద్దేశంతో పత్రిక.. జనామోదం పొందలేక మూత
నేషనల్ హెరాల్డ్ పేరు చాలామందికి తెలుసు. స్వాతంత్య్రోద్యమ సమయంలో.. 1938లో జనానికి వార్తలు చేరవేయడానికి.. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేసిన పత్రిక ఇది. అసోసియేటెడ్ జర్నల్స్ అనే కంపెనీ దీంతో పాటు పేరు లేని చిన్నాచితకా పత్రికల్నీ ప్రచురించేది. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ కంపెనీకి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవ నాల రూపంలో పలు రకాల ఆస్తుల్ని కట్టబెట్టాయి.
ఆస్తులు పెరిగినా... నష్టాల్లోకి
అయితే ఆస్తులు పెరిగినా పత్రికగా మాత్రం అది రాణించలేకపోయింది. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్‌తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నా.. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో 2008కి వచ్చేసరికి మూతపడింది. జీతాలతో పాటు ఇతర బకాయిలూ పేరుకుపోవటంతో... కాంగ్రెస్ దీన్ని కాపాడాలనుకుంది. ప్రజల నుంచి చందాలు, విరాళాల రూపంలో వసూలు చేసిన పార్టీ నిధి నుంచి అసోసియేటెడ్ జర్నల్స్‌కు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ డబ్బుతో దాని రుణాలు తీర్చుకోమంది.
తెరపైకి ‘యంగ్ ఇండియన్’
అసోసియేటెడ్ జర్నల్స్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల అప్పిచ్చిన రెండేళ్లకు.. అంటే 2010 నవంబర్లో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.5 లక్షల మూలధనంతో ‘యంగ్ ఇండియన్’ అనే సంస్థ పుట్టుకొచ్చింది. దీన్లో 76 శాతం వాటా సోనియా, రాహుల్ గాంధీలదే. మిగతా 24 శాతం మాత్రం గాంధీలకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్న మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లది (ఇప్పుడు వీరిద్దరూ సజీవంగా లేరు). అయితే ఏంటట అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది.
‘చరిత్రాత్మక’ ఒప్పందం..
‘యంగ్ ఇండియన్’ పుట్టిన 15 రోజులకే దాని తరఫున అధికారిక ప్రతినిధిగా మోతీలాల్ వోరా ఓ అత్యద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు. అదీ మరెవరితోనో కాదు. కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాతోను.. అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరాతోను!!. అంటే మూడింటి తరఫునా రకరకాల హోదాల్లో తనే ఒప్పందంపై సంతకాలు పెట్టేశారు. ఇంతకీ ఆ ఒప్పందం ఏంటో తెలుసా? రూ.90 కోట్ల రుణాన్ని అసోసియేటెడ్ జర్నల్స్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది కనక.. దాని బదులు తామైతే ఓ 50 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీకి ‘యంగ్ ఇండియన్’ ఓ ఆఫరిచ్చింది. యంగ్ ఇండియన్ ప్రతినిధిగా మోతీలాల్ వోరాయే ఈ మేరకు లేఖ రాశారు.
90 కోట్లు ఎటూ రాదు.. 50 లక్షలైనా వస్తోంది కదా.. అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఓకే చేసింది. అంటే.. కాంగ్రెస్ కోశాధికారిగా వోరాయే ఓకే చేశారు. ఇటు అసోసియేటెడ్ జర్నల్స్‌కూ ‘యంగ్ ఇండియన్’ ఓ ప్రతిపాదన చేసింది. మీరెలాగూ రుణం చెల్లించలేరు.. మీ బదులు మేం చెల్లిస్తాం.. ఆ మేరకు వాటాను మాకు బదిలీ చేసేయండి.. అనేది దాని సారాంశం. ఈ లేఖ రాసిందీ వోరాయే. జర్నల్స్ ఎండీ హోదాలో దీనికి ఓకే చేసింది వోరాయే.
అంటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పును ఓరా మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ కంపెనీ తీర్చలేకపోవటంతో.. ఆ రుణాన్ని 94 శాతాన్ని మాఫీ చేసి కంపెనీని మాత్రం సోనియా యజమానిగా ఉన్న యంగ్ ఇండియన్‌కు రూ.50 లక్షలిస్తే చాలునన్న లెక్కతో కట్టబెట్టేశారు. ఫలితం... కాంగ్రెస్ ఇచ్చిన 90 కోట్లు గాయబ్ అయ్యాయి. అసోసియేటెడ్ జర్నల్స్‌కు చెందిన వేల కోట్ల ఆస్తులు సోనియా చేతికి వచ్చేశాయి. అదీ కథ. నిజానికి 2008లో ఐటీ శాఖ దీని ఆస్తుల విలువను రూ.2 వేల కోట్లుగా లెక్కించింది. మార్కెట్ విలువ 5 వేల కోట్లపైనే. ఇప్పుడు వాటి విలువ ఎన్ని వేల కోట్లుంటుందనేది ఊహించటం కష్టమే.
మరో విచిత్రమైన మలుపు
కాంగ్రెస్‌లానే ఈ కథ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. యంగ్ ఇండియన్ దగ్గర చెల్లించడానికి ఆ 50 లక్షలు లేవు. దానికి బ్యాంకు ఖాతా లేదు. మరెలా? 2011 ఫిబ్రవర్లో యంగ్ ఇండియన్ సంస్థ డాటెక్స్ మర్చండైజింగ్ అనే కంపెనీ నుంచి రూ.1కోటి రుణం తీసుకుంది. దాంట్లో రూ.50 లక్షలను మార్చిలో కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. అంటే 2010 డిసెంబర్లో రూ.90 కోట్ల సరుకు తీసుకుని 3 నెలలకు దానికి 50 లక్షలు అప్పు తెచ్చి చెల్లించిందన్న మాట. ఇంత అద్దిరిపోయే ఆఫర్ ఎవ్వరికైనా ఎదురవుతుందా? ఎంతైనా సోనియా.. రాహుల్ మరి. తీర్చలేని దయనీయ పరిస్థితుల్లో 90 కోట్ల రుణం 50 లక్షలుగా మారిపోయింది.
కాకపోతే అది యంగ్ ఇండియన్ చేతికి వచ్చేసిందిగా!!. కథ మారింది. 90 కోట్లు పోతే పోయింది. ఎనలేని దయతో రూ.50 లక్షలు చెల్లించినందుకు ‘యంగ్ ఇండియన్’కు సంస్థలో 99 శాతం షేర్లు కేటాయించారు అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరా. పాపం.. అప్పటిదాకా కంపెనీలో షేర్లున్న 32,000 మంది షేర్‌హోల్డర్లు... ఈ కొత్త షేర్ల కేటాయింపుతో 1 శాతానికి పరిమితమైపోయారు. నిజానికి వాళ్లంతా నాటి స్వాతంత్ర సమరయోధులు.
నిబంధనల ప్రకారం వారి వారసులకు ఆ వాటా చెందాలి. వారసులెవరో తెలియనప్పుడు సదరు ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. దీన్ని తప్పించుకోవటానికే ఈ కేటాయింపు. ఈ మొత్తం లావాదేవీల్లో కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల నుంచి సేకరించిన 89.5 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. జర్నల్స్‌లో వాటా ఉన్న షేర్ హోల్డర్లు తమ వాటా విలువను పూర్తిగా కోల్పోయారు. కానీ 50 లక్షలు పెట్టుబడితో సోనియా, రాహుల్ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ ఆస్తులకు యజమానులైపోయారు.
Comments
Please login to add a commentAdd a comment