ఆ దుర్మార్గుడు చిక్కాడు..
బెంగళూరు: మహిళలపై లైంగిక దాడి చేసి, చిత్రీకరించిన తొమ్మిది వీడియోక్లిప్పులను ఇంటర్నెట్లోను, వాట్పాప్లోను షేర్ చేసిన దుర్మార్గుడు దొరికాడు. ఒడిశాకు చెందిన కౌశిక్ సత్యపాల్ కౌనార్ను బెంగళూరులో సీబీఐ అరెస్ట్ చేసింది. అతడి దగ్గర నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని 400 నీలి చిత్రాలను, మహిళలపై లైంగిక దాడిచేసినప్పుడు తీసిన తొమ్మిది వీడియోలలో మూడింటిని స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది. హైదరాబాద్కు చెందిన యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు..దీనిపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో అప్రమత్తమైన సీబీఐ నిందితుని వేటాడి పట్టుకుంది.
నిందితుడు బెంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, ఫోరెన్సిక్ సాఫ్ట్ వేర్ సహాయంతో అతడ్నిగుర్తించామని సీబీఐ అధికారులు తెలిపారు. పోస్ట్ చేసిన తొమ్మిది వీడియోలలో మూడు వీడియోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. మరోవైపు దీనిపై సామాజిక ఉద్యమకారిణి సునీతా కృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ దుర్మార్గుడు దొరికాడు..హ్యాట్స్ ఆఫ్ టు సీబీఐ అంటూ ట్వీట్ చేశారు. సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్ నిందితులను గుర్తుపట్టేలా వారి ఫొటోలతో కూడిన వీడియోను ఫిబ్రవరిలో తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆమె యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.