
క్రమేణా సబ్సిడీలు హేతుబద్ధం: జైట్లీ
చెన్నై: దేశంలో వివిధ రంగాల్లో అమలు చేస్తున్న అన్ని సబ్సీడీలను క్రమేణా హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అప్పుడే దేశంలో భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, తద్వారా ఆశించిన ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న 2015-16 సాధారణ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మండలి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, వంట గ్యాస్ సబ్సిడీని బ్యాంకుల ద్వారా బట్వాడా చేయడం జనవరి నుంచి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ సాధ్యమయ్యే అన్ని సబ్సిడీలను సాధ్యమైనంత త్వరగా హేతుబద్ధం చేస్తామని ప్రకటించారు.
చమురు, ఎరువులకు ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దాటిందని దీన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని ఆర్థిక వ్యయ కమిషన్ సిఫార్సులను రానున్న బడ్జెట్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జైట్లీ తెలిపారు.