న్యూఢిల్లీ : సిగరెట్లు, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రజల్లో ఎలాగైనా మాన్పించాలనే ఉద్దేశ్యంతో, ఆ ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, భయానకమైన ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్‌లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది.
ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్‌పై ముద్రించాలని కూడా ఆదేశించింది. ఈ హెల్ప్ లైన్‌నెంబర్ పొగాకు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. పొగాకు ఉత్పత్తులను మానడానికి వారికి కౌన్సిలింగ్ సర్వీసులను కూడా అందించనుంది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్(www.mohfw.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment