cigerate
-
సిగరెట్ తెచ్చిన తంటా
సాక్షి, క్రైమ్: కెనడా పోలీసులకు పంచ్ విసరబోయి ఇరకాటంలో పడ్డాడో వాహనదారుడు. సిగరెట్ పీకే కదా అని నిర్లక్ష్యంగా కారు కిటికీ నుంచి బయటపడేశాడో వ్యక్తి. అది చూసిన పోలీస్ డెల్ మనాక్ నేరుగా ఆ వాహనం దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను దురుసుగా బదులిస్తూ కారు కాలి పోకూడదనే బయటకు విసిరేశానని చెప్పాడు. అంతే ఘాటుగా స్పందించిన పోలీస్ ముందు కారులో సిగరెట్ తాగడం మానేయ్ అంటూ ఝలక్ ఇచ్చాడు. ఆ పోలీస్ అతని దూకుడుకు కళ్లెం వేయడమే కాక, మరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన బుద్ధి చెపాలని భావించాడు. అనుకున్నదే తడవుగా కాలుతున్న సిగరెట్ పీకను బయటకు విసరకూడదనేందుకు 575 కారణాలున్నాయని చెప్పి, అందుకు ప్రతిగా 575 కెనడా డాలర్ల జరిమానా విధించాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,000 లతో సమానం. పోలీస్ అధికారి ట్విట్టర్లో తాను విధించిన చలానా ఫోటోతో సహా ఈ వివరాలు పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పోలీసు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
పాన్‌షాపులో మరోసారి చోరీ
సాక్షి, తాండూరు టౌన్: పాన్‌షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూ రు ఇందిరానగర్‌కు చెందిన ఎండీ అస్లాం స్థానిక లారీ పార్కింగ్ వద్ద జీషాన్ పాన్‌మహల్ పేరుతో పాన్‌షాపు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే షాపు తెరిచేందుకు వెళ్లిన అస్లాం షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు. పాన్‌షాపు రేకును కట్ చేసి చొరబడిన దొంగలు రూ. 10 వేల నగదుతో పాటు, సుమారు రూ.35వేల విలువైన సిగరెట్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని అస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇదే తరహాలో గతేడాది అక్టోబర్‌లో కూడా అస్లాం పాన్‌షాపులో చోరీ జరిగింది. -
సిగరెట్ ప్యాకెట్లపై భయానక చిత్రాలు
న్యూఢిల్లీ : సిగరెట్లు, గుట్కా, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రజల్లో ఎలాగైనా మాన్పించాలనే ఉద్దేశ్యంతో, ఆ ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, భయానకమైన ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్‌లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్‌పై ముద్రించాలని కూడా ఆదేశించింది. ఈ హెల్ప్ లైన్నెంబర్ పొగాకు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. పొగాకు ఉత్పత్తులను మానడానికి వారికి కౌన్సిలింగ్ సర్వీసులను కూడా అందించనుంది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్(www.mohfw.gov.in) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రించాల్సి ఉంది. -
సిగరెట్‌కు వచ్చి.. గొలుసు స్నాచింగ్
దుండిగల్: సిగరెట్ కావాలని వచ్చి పుస్తెలతాడు తెంచుకెళ్లిన ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సూరారం కాలనీ 60 గజాలకు చెందిన పట్టిపతి మణి (34) డీపోచంపల్లి సర్వే నెంబర్ 120 ప్రధాన రోడ్డులో టీకొట్టు నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు యువకులు టీకొట్టు వద్దకు వచ్చారు. వారిలో ఒకడు సిగరెట్ కావాలని అడిగి అమాంతం మణి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు తెంచుకొని.. మరో యువకుడితో కలిసి బైక్‌పై మేడ్చల్ వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వయసు 20 నుంచి 25 మధ్య ఉంటుందని, ఇద్దరూ హెల్మెట్లు, రెయిన్ కోట్ ధరించారని మణి పోలీసులకు తెలిపింది.