
సాక్షి, క్రైమ్: కెనడా పోలీసులకు పంచ్ విసరబోయి ఇరకాటంలో పడ్డాడో వాహనదారుడు. సిగరెట్ పీకే కదా అని నిర్లక్ష్యంగా కారు కిటికీ నుంచి బయటపడేశాడో వ్యక్తి. అది చూసిన పోలీస్ డెల్ మనాక్ నేరుగా ఆ వాహనం దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను దురుసుగా బదులిస్తూ కారు కాలి పోకూడదనే బయటకు విసిరేశానని చెప్పాడు. అంతే ఘాటుగా స్పందించిన పోలీస్ ముందు కారులో సిగరెట్ తాగడం మానేయ్ అంటూ ఝలక్ ఇచ్చాడు.
ఆ పోలీస్ అతని దూకుడుకు కళ్లెం వేయడమే కాక, మరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన బుద్ధి చెపాలని భావించాడు. అనుకున్నదే తడవుగా కాలుతున్న సిగరెట్ పీకను బయటకు విసరకూడదనేందుకు 575 కారణాలున్నాయని చెప్పి, అందుకు ప్రతిగా 575 కెనడా డాలర్ల జరిమానా విధించాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,000 లతో సమానం. పోలీస్ అధికారి ట్విట్టర్‌లో తాను విధించిన చలానా ఫోటోతో సహా ఈ వివరాలు పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పోలీసు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.