అంబులెన్స్లో పేలుడు: నవజాత శిశువు మృతి
థానే : మహారాష్ట్ర థానేలో విషాదం చోటుచేసుకుంది. మెరుగైన వైద్యం కోసం నవజాత శిశువును తరలిస్తుండగా సీఎన్జీ గ్యాస్ రూపంలో మృత్యువు కాటేసింది. అంబులెన్స్ లోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలి రెండురోజుల పసిగుడ్డు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి...థానే నగరంలో ఓ మహిళ.. శిశువుకి బుధవారం జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానిక వేదాంత ఆసుపత్రికి తరలించాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో చిన్నారిని అక్కడకు తరలించారు.
కానీ వేదాంత వైద్యులు కూడా శిశువు పరిస్థితి విషమంగా ఉన్నందున... ముంబైలోని స్పెషాలిటి కేర్ సెంటర్కి తరలించాలని సూచించారు. గురువారం ఆర్థరాత్రి అంబులెన్స్ను సిద్ధం చేసి అందులో శిశువును తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలింది. అంబులెన్స్లోని పేలుడు సంభవించింది. అగ్నికీలలు ఎగసిపెడ్డాయి. ఇంతలో నవజాత శిశువు అగ్నికి ఆహుతి అయింది.
స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్లోని శిశువు తల్లితో పాటు మరొకరిని రక్షించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... శిశువు తల్లితోపాటు మరొకరికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎన్జీ కిట్లో పేలుడు సంభవించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.