‘నైటీల’ చరిత్ర ఇంతింత కాదయా! | Nighties History In India | Sakshi
Sakshi News home page

‘నైటీల’ చరిత్ర ఇంతింత కాదయా!

Published Tue, Aug 14 2018 5:49 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

Nighties History In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నైటీలంటే రాత్రిపూట మహిళలు వేసుకునే దుస్తులు అని అందరికి తెల్సిందే. కానీ వాటిని ఇప్పుడు రాత్రులందే కాకుండా పగటి పూట పనులందూ వేసుకుంటున్నారు. ఎందుకంటే అవి అందుకు ఎంతో అనువుగా ఉంటాయికనుక. భారత దేశంలో ఈ నైటీలకు బహుళ ప్రాచుర్యం తీసుకొచ్చిందీ మాత్రం కేరళకు చెందిన భార్యాభర్తలు. వారే బెన్నీ ఎన్‌ఏ, షెర్లీ బెన్నీలు. షెర్లీ బెన్నీ కథనం ప్రకారం 1987లో బెన్నీ ఎన్‌ఏ వద్ద మూడు వేల రూపాయల మిగులు రూపాయలున్నాయట. అందరిలాగా ఆయన వాటిని బ్యాంకులో దాచుకోకుండా ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడట. ఆడవారికి అనువైన దుస్తులు తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందీ ఆయనకు ఓనాడు. కేరళలో మహిళలు ఎక్కువగా కష్టపడతారుకనుక వారికి అనువైన, అంతగా అందుబాటులో లేని అరుదైన దుస్తులను తయారుచేసి అమ్మితే లాభసాటిగా ఉంటుందని భావించారట.

కేవలం నైటీలనే మాత్రమే తయారు చేయాలనుకొని కేవలం 300 చదరపు అడుగుల స్థలంలో ‘ఓరియన్స్‌ క్రియేటర్స్‌’ పేరిట ఓ ముగ్గురు పనివాళ్లతో ఓ కుట్టుమిషన్‌ కేంద్రాన్ని బెన్నీ ఏర్పాటు చేశారు. కొచ్చీకి గంటన్నర దూరంలోని పిరవోమ్‌లో ముగ్గురు కార్మికులతో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు 600 మంది కార్మికులు పనిచేసే ‘ఎన్‌స్టైల్‌’ ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్న ఈ ఎన్‌స్టైల్‌కు ఇప్పుడు కేరళ వ్యాప్తంగా 400 రిటేల్‌ షాపులున్నాయి. ముందు కేరళ, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ నైటీలకు ఎంతో ఆదరణ లభించింది. ఇప్పుడు ఎన్‌స్ట్‌ల్‌కు ఫాషన్‌ డిజైనర్‌గా, సీఈవోగా బెన్నీ భార్య షెర్లీ బెన్నీ వ్యవహరిస్తున్నారు. భర్త మార్కెటింగ్‌ వ్యవహారాలు చూస్తున్నారు. 1980 దశకంలో దేశవ్యాప్తంగా నైటీలు ప్రాచుర్యం కావడానికి ఈ కంపెనీ ఉత్పత్తులే కారణమని చెబుతారు. 90 శాతం కాటన్, పది శాతం పాలిస్టర్‌తో తయారు చేసిన ఈ నైటీలు మార్కెట్లో 200 రూపాయల నుంచి 800 రూపాయల మధ్య లభిస్తాయి.



గల్ఫ్‌ దేశాల్లో మహిళలు ఎక్కువగా నైటీలు ధరిస్తారని, కేరళ నుంచి గల్ఫ్‌ దేశాలకు పనికోసం ఎక్కువగా వెళ్లే మగవాళ్లు, తమ భార్యల కోసం అక్కడి నుంచి నైటీలు తెచ్చేవారని, అలా కేరళ మహిళల్లో నైటీలకు ఆదరణ మొదలైందని స్థానికులు చెబుతారు. దాన్ని దృష్టిలో  పెట్టుకొనే బెన్నీలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారని కూడా వారంటున్నారు. వాస్తవానికి భారత దేశంలో విక్టోరియా రాణి కాలం నుంచి మహిళలకు నైటీలు పరిచయం. ఇంగ్లాండ్‌ రాజవంశానికి చెందిన మహిళలు, బ్రిటీష్‌ ఉన్నతాధికారుల భార్యలు నైటీలు ధరించేవారు. వారు కేవలం పడుకునేటప్పుడు మాత్రమే ధరించే వీటిని నైట్‌ గౌన్లు అని పిలిచేవారు. వారిని చూసి భారతీయ కులీన వర్గానికి చెందిన మహిళలు కూడా నైటీలు ధరించడం మొదలు పెట్టారు.

1960వ దశకాల్లో మన బాలీవుడ్‌ తారలు సినిమాల్లో నైటీలతో దర్శనమిచ్చారు. ‘అందాజ్‌’ బాలివుడ్‌ సినిమాలో నర్గీస్, ‘అన్బె వా’ తమిళ చిత్రంలో సరోజా దేవీ, ‘కలివీడు’ మలయాళం చిత్రంలో ప్రముఖ నటి మంజూ వారియర్‌లు నైటీలు ధరించారు. ముంబైలో 1980వ దశకంలోనే మరాఠీ, గుజరాతీ మహిళలు నైటీలు ధరించడం ప్రారంభించారు. బ్రిటీష్‌ పాలకులకు ముందే అంటే, ప్రాచీన ఈజిప్టు, రోమన్ల ద్వారా మనకు నైటీలు పరిచయమయ్యాయని బెంగళూరుకు చెందిన ఫ్యాషన్‌ స్లైలిస్ట్, కొరియాగ్రాఫర్‌ ప్రసాద్‌ బిడప తెలిపారు. స్కర్టులు, ప్యాంట్లు ఎక్కువగా ధరించే అమెరికా మహిళలు కూడా ఇప్పుడు నైటీల వెంట పడుతున్నారట. అక్కడి నైటీల మోజుపై ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక గత జూలై నెలలో ‘వియర్‌ యువర్‌ నైటీ అవుట్‌’ శీర్షికన ఓ వ్యాసాన్ని ప్రచురించింది.



ఒకప్పుడు రాత్రిపూట వేసుకునేందుకే పరిమితమైన నైటీలు ఇప్పుడు ఇంట్లో ఉన్నంత సేపు వేసుకునే దుస్తులుగా మారిపోయాయి. అంతేకాకుండా పలు నగరాల్లో తల్లులు నైటీలపైనే తమ పిల్లలను కాన్వెంట్లలోనూ, స్కూళ్లలోనూ దించొస్తున్నారు. అలా తల్లులు నైటీలపై వస్తున్నందుకు 2013లో చెన్నైలోని ఓ స్కూల్‌ వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇకముందు అలా వస్తే పిల్లలను స్కూల్లోకి అనుమతించమని బెదిరించింది. నవీ ముంబైలో ఓ మహిళా సంఘం నైటీలపై బయట తిరిగే మహిళలకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించేందుకు ప్రయత్నించింది. ఈ రెండు సంఘటనల్లోనూ న్యాయ పోరాటంలో నైటీలే గెలిచాయి.

కార్మికుల సమ్మె, యూనియన్ల గొడవల కారణంగా ‘ఓరియన్స్‌ క్రియేటర్స్‌’గా మూడు దశాబ్దాలు ‘ఎన్‌స్టైల్‌’గా రెండు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన తమ ఉత్పత్తి కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు మార్చాలని బెన్నీ దంపతులు నిర్ణయించారు. అక్కడ చాలా చౌకగా కార్మికులు లభించడమే అందుకు కారణం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement