ముంబై : అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర తుఫాను(నిసర్గ తుఫాను)గా మారిన సంగతి తెలిసిందే. కాగా నిసర్గ తుపాను బుధవారం ముంబైలోని అలీబాగ్ వద్ద మధ్యాహ్నం 1గంట సమయంలో తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. నిసర్గ తుఫాను అలీబాగ్ వద్ద తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబై నగరానికి ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.(నిసర్గ: చార్జింగ్ పెట్టుకోండి.. గ్యాస్ కట్టేయండి!)
ముందుజాగ్రత్త చర్యగా ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాత్రి 7గంటల వరకు మూసివేశారు. కాగా తుఫాను ప్రభావంతో ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్‌లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను మోహరించారు. గుజరాత్‌లో 15 ఎన్డీఆర్‌ఎఫ్, 6 ఎస్డీఆర్‌ఎఫ్ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment