విభజనను సులభతరం చేసేందుకే కమిటీ : పీసీ చాకో
విభజనను సులభతరం చేసేందుకే కమిటీ : పీసీ చాకో
Published Thu, Aug 8 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. తెలంగాణ డిమాండ్ ఈనాటిది కాదని, ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించేందుకు పార్టీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతుందని భావించనవసరం లేదన్నారు. ‘ఆంటోనీ కమిటీని వేసినంత మాత్రాన.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదు’ అని బుధవారమిక్కడ పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో అన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అమలులో ఎదురయ్యే సమస్యలపై చర్చించి, తగిన పరిష్కారాలను సూచించడం ద్వారా రాష్ట్ర విభజనను సులభతరం చేసేందుకే ఈ కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ‘తెలంగాణ ఏర్పాటు వల్ల తమ ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలను సీమాంధ్ర నేతలు ఆంటోనీ కమిటీకి వివరించవచ్చు. సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి, తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను వారు చేయవచ్చు’ అని పేర్కొన్నారు.
సోనియాతో కావూరి భేటీ
కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకున్నారు. కాగా ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన జాతీయ చేనేత కార్మిక దినోత్సవం కార్యక్రమానికి హాజరై వెళ్తున్న సమయంలో మీడియా చుట్టుముట్టగా కావూరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో తానేమీ చేయలేనని, నిస్సహాయుడినన్నారు. విభజన ప్రకటన తర్వాత నోరుమెదపడం లేదనే అపవాదు మీపై ఉందని అడగ్గా..‘‘ ఉంటే ఉండనివ్వండి. నాకు వ్యక్తిత్వం ఉంది. స్పష్టత ఉంది. ఇంటెగ్రిటీ ఉంది. నేను నిస్సహాయుడిని’’ అంటూ వెళ్లిపోయారు.
కేబినెట్ ఎజెండాలో లేని తెలంగాణ
గురువారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తెలంగాణ అంశానికి చోటుదక్కలేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి మంత్రివర్గ పరిశీలనకు సవివర నివేదిక అందాల్సి ఉంటుందని, ఆ నివేదికలో విభజనతో ముడిపడి ఉన్న పలు కీలకాంశాలపై సిఫార్సులు కూడా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంట్‌కు తెలియజేయడం విదితమే. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యల అధ్యయనానికి ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ఆ ప్రాంత నేతలతో సంప్రదింపులు పూర్తిచేయకుండానే.. ప్రభుత్వ స్థాయిలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించలేమనే అభిప్రాయంతోనే గురువారం నాటి కేబినెట్ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ ‘ఎన్నికల హామీల’ కమిటీ పునర్‌వ్యవస్థీకరణ
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరును పర్యవేక్షించేం దుకు ఏర్పాటైన కమిటీని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా పునర్‌వ్యవస్థీకరించారు. ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో కేంద్ర మంత్రి నారాయణస్వామి, దిగ్విజయ్‌సింగ్, తిరునావక్కరసు, కుంటియా, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను సభ్యులుగా నియమించారు.
Advertisement