బిల్లులో 'ప్రత్యేక హోదా' లేదుః వెంకయ్యనాయడు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పునర్ వ్యవస్థీకరణ బిల్లులో లేదని, ఎందుకు లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఈ రోజు లోక్ సభలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడిన తరువాత వెంకయ్య మాట్లాడుతూ ''కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ నిన్న మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇలా అంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా బిల్లులో లేదు. బిల్లులో ఎందుకు లేదో కాంగ్రెస్ చెప్పాలి'' అని అన్నారు.
రాజ్యసభ సభ్యుల సర్దుబాటు తదితర అంశాలన్నింటిపై ఇంకా సవరణలు చేయాల్సి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని సమస్యల పరిష్కారంతో కూడిన సమగ్రమైన బిల్లు కోసం కొందరు సభ్యులు అడిగారని, దీనికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుతూ తెచ్చిన ఈ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన దుర్భర పరిస్థితుల్లో ఏ మార్పులూ రావని వైఎస్సార్‌సీపీ ఎంపి మిథున్‌రెడ్డి అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుకు నిర్ధిష్ట కాలపరిమితి ఉండాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్‌కు ఇచ్చిన విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.