కాంగ్రెస్‌కు మాజీ సైనికాధికారి షాక్ | no surgical strikes in upa tenure, says former dgmo | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు మాజీ సైనికాధికారి షాక్

Published Fri, Oct 7 2016 9:02 AM | Last Updated on Sat, Aug 25 2018 5:25 PM

కాంగ్రెస్‌కు మాజీ సైనికాధికారి షాక్ - Sakshi

కాంగ్రెస్‌కు మాజీ సైనికాధికారి షాక్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని.. కాకపోతే అప్పట్లో తమ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ నాయకుల్లా ప్రచారం చేసుకోలేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు... మాజీ డీజీఎంఓ పెద్ద షాకిచ్చారు. గతంలో కేవలం సరిహద్దుల వెంబడి మామూలు దాడులే జరిగాయని, అసలు ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కు, వాటికి ఏమాత్రం సంబంధం లేదని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా బాంబు పేల్చారు. ''ఇవి చాలా సున్నితమైనవి, పక్కా లక్ష్యం కేంద్రంగా చేసినవి, మన దేశ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఇంతకుముందు నియంత్రణ రేఖ వెంబడి జరిగిన దాడులకు వీటికి అన్ని రకాలుగా చాలా తేడా ఉంది'' అని భాటియా వెల్లడించారు. ఆయన 2012 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌గా వ్యవహరించారు.

2011 సెప్టెంబర్ 1, 2013 జూలై 28,  2014 జనవరి 14 తేదీలలో కూడా యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ వాదిస్తోంది. సర్వసాధారణంగా జరిగే దాడులను కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఎన్డీయే ప్రభుత్వం తెగ గుండెలు బాదేసుకుంటోందని విమర్శించింది.

అయితే.. దీనిపై నడుస్తున్న రాజకీయాల జోలికి తాను పోనని, అప్పట్లో జరిగిన ఆపరేషన్స్‌ను, ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఏమాత్రం పోల్చలేమని మాత్రమే తాను చెబుతున్నానని లెఫ్టినెంట్ జనరల్ భాటియా అన్నారు. ఇంతకుముందు జరిగిన దాడులకు కూడా మంచి ముందస్తు ప్రణాళిక ఉన్నా.. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా మన జాతీయ శక్తిలోని అన్ని అంశాలూ ఒక్కటిగా కలిశాయని తెలిపారు. దౌత్య, ఆర్థిక, సమాచార యుద్ధతంత్రం.. ఇలా అన్నీ కలిశాయని చెప్పారు. ఉడిలో ఉగ్రదాడి జరిగి 19 మంది సైనికులు మరణించిన తర్వాత.. భారత దేశ సహనం చచ్చిపోయిందని, అందుకే మనం గీత దాటామని ఆయన తెలిపారు. ఒకేసారి నియంత్రణ రేఖకు అవతల పలు లక్ష్యాల మీద దాడులు జరిగాయని, బంబెర్ నుంచి పీర్ పంజల్‌కు రెండువైపులా కూడా మన బలగాలు మోహరించాయని, సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహం ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని లెఫ్టినెంట్ జనరల్ భాటియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement