
గత ప్రభుత్వమే ఆర్డినెన్స్ తెచ్చింది: వెంకయ్య
చర్చ జరిగి ఉంటే అన్ని విషయాలు ప్రజలకు తెలిసేవి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందని, ఇందులో వివాదం లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అనవసరంగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఆర్డినెన్స్ లోక్‌సభ ఆమోదం పొందడంలో రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదన్నారు.
సభలో ఈ విషయంపై చర్చించడం కోసం ప్రభుత్వం 2 గంటలు కేటాయించిందని, చర్చ జరిగితే విషయాలు ప్రజలకు తెలిసేవన్నారు. దురదృష్టవశాత్తూ సభ్యులు వెల్‌లోకి వెళ్లడంతో ఇతర సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ‘ఈ ఆర్డినెన్స్‌ను 18వ తేదీలోగా రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతికి పంపాల్సి ఉంది.
కాంగ్రెస్ సభ్యులు దీన్ని విమర్శించడం విడ్డూరం. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత తమను సంప్రదించకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారన్న వాదన సరికాదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే నిర్ణయం జరిగిపోయింది. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం, తగిన నష్టపరిహారం బాధ్యతలను కేంద్రం చేపట్టే ఉద్దేశంతో ఏపీకి బదిలీ చేసింది. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలుపుతున్నారన్న భావన సరైంది కాదు. సోనియా కూడా ఈ ప్రాజెక్టును త్వరిత గతిన ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. ఆ ఉత్తరం కూడా నేను ఇస్తాను. అడ్డంకులు తొలగిస్తానని అప్పటి ప్రధాని కూడా చెప్పారు’ అని వెంకయ్య అన్నారు.