సాక్షి, ముంబై : పుణె సమీపంలో గల పర్యాటక ప్రాంతం పవన సరస్సులో అరుదైన మాంసాహార చేపను కనుగొన్నట్లుగా పవన డ్యామ్ అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ఈ చేప పేరు ‘అలిగేటర్ గార్’ అని పేర్కొన్నారు. వివరాలు.. స్థానిక జాలర్లు కొన్ని రోజుల క్రితం పవన సరస్సు(కృత్రిమమైనది)లో చేపలు పట్టేందుకు వెళ్లగా అరుదైన చేప వారి గాలానికి చిక్కింది. దీంతో జాలర్లు ఫిషసరీస్ సంస్థ నిపుణుల వద్దకు తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో ఈ చేపను పరిశీలించిన అధికారులు మాంసాహార చేపగా గుర్తించారు. 17 సెంటీమీటర్ల పొడవు, రెండున్నర కిలోల బరువు ఉన్న ఈ చేప ఇతర చేపలను, సముద్ర జీవులను తినడం ద్వారా మనుగడ సాగిస్తుందని తెలిపారు. ఇటువంటి చేపల వల్ల సముద్ర జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అయితే ఉత్తర అమెరికాలో లభించే ఈ చేప పవన సరస్సులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బహుషా ఎవరైనా బయటి వ్యక్తులు అక్వేరియంలో పెంచుకునేందుకు ఈ చేపను తెచ్చుకుని ఉంటారని, వారే దీనిని సరస్సులో వదిలి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇతర సముద్ర జీవులకు హాని కలిగే అవకాశం ఉంది గనుక ఇటువంటి చేపల జాడ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని జాలర్లకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment