
మంత్రుల కార్లపై కోడిగుడ్లతో దాడి..
ఆహార భద్రత చట్టం అమలులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘం నిర్వహించిన ఆందోళన.. చివరికి మంత్రులపై కోడిగుడ్లు, టమాటల దాడికి దారితీసింది. ఒడిశాలోని దేవ్ గఢ్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి సబ్యసాచి నాయక్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కోడుగుడ్లు, టమాటలతో దాడిచేశారు. నిన్న (సోమవారం) కూడా సరిగ్గా ఇలాగే మరో మంత్రిపై దాడి జరిగింది.
ఛత్రపూర్ లో పౌరసరఫరాల శాఖ మంత్రి సంజయ్ దాస్ కారుపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విబాగం నాయకులు కోడిగుడ్లు విసిరారు. సోమవారం నాటి సంఘటనలో ముగ్గురు విద్యార్థులతోపాటు ఒక కాంట్రాక్టర్ ను పోలీసులు అరెస్టుచేశారు. విద్యార్థుల అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ ఖండన తెలిపింది. పేద రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాలో ఆహార భద్రత చట్టం అమలులో అధికార బీజేడీ అక్రమాలకు పాల్పడుతోందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ లోపభుయిష్టంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ మేరకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం మంత్రుల పర్యటనల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది.