రా 'రమ్మ'oటే పోతున్నారు! | Is Old Monk Brand is dying? | Sakshi
Sakshi News home page

రా 'రమ్మ'oటే పోతున్నారు!

Published Tue, Jan 9 2018 5:13 PM | Last Updated on Tue, Jan 9 2018 5:17 PM

Is Old Monk Brand is dying? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'ఓల్డ్‌ మాంక్‌ రమ్' పేరు వినగానే గ'మ్మత్తు'గా ఒళ్లు పులకరించిపోతుందీ మందుబాబులకు. భారత సైనికాధికారుల నుంచి వీధిలోని సామన్యుడి వరకు తారతమ్యం లేకుండా తెగ తాగిన బ్రాండ్‌ ఓల్డ్‌ మాంక్‌. కొందరు ముద్దుగా 'వృద్ధ సన్యాసి' అని పిలుచుకునేవారు. రా 'రమ్మ'oటూ పిలుస్తే రానా? అని మహాకవి శ్రీశ్రీ తనదైన శైలిలో ఫన్‌ చేశారు. ఓల్డ్‌ మాంక్‌ ప్రేమికులకు, అభిమానులకు ఫేస్‌బుక్‌లో ఏకంగా ఓ పేజీ ఉందంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఆ పేజీ పేరు 'కామ్రేడ్స్‌'. అంటే,  కౌన్సిల్‌ ఆఫ్‌ ఓల్డ్‌ మాంక్‌ రమ్‌ ఆడిక్టెట్‌ డ్రింకర్స్‌ అండ్‌ ఎక్సెట్రిక్స్‌. 

గజియాబాద్‌ ప్రధాన కార్యాలయంగా ప్రముఖ వ్యాపారవేత్త మోహన్‌ మేకిన్‌ దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్‌ తన పూర్వవైభవాన్ని కోల్పోతూ క్రమక్రమంగా మార్కెట్‌లో తన విక్రయ వాటాను కోల్పోతూ వస్తోంది. యూరోమనిటర్‌ సంస్థ అంచనాల ప్రకారం 2005 నుంచి ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌ మార్కెట్‌ పది శాతం పడిపోగా, ప్రస్తుతం రమ్‌ మార్కెట్‌లో ఐదు శాతానికి పరిమితం అయింది. రమ్‌ విధేయులు దీనికి దూరమవడం, విదేశీ బ్రాండ్ల కోసం ఎగబ్రాకడం వల్ల ఓల్డ్‌ మాంక్‌ అమ్మకాలు పడిపోలేదు. దేశవ్యాప్తంగా రమ్ము తాగేవారి సంఖ్య తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.
 
దేశంలో ఇతర మద్యాల అమ్మకాలు సరాసరి సగటున ఏటా ఆరు శాతం పెరుగుతుండగా, బీర్లు ఎనిమిది శాతం పెరుగుతుండగా, రమ్ము మార్కెట్‌ ఏటా 0. 2 శాతం తగ్గుతూ వస్తోంది. 2014లో రమ్‌ మార్కెట్‌ 38.70 కోట్ల లీటర్లు ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. అంతకుముందు సంవత్సరం అమ్ముడుపోయిన సరకు కన్నా ఇది 1.5 శాతం తక్కువ. అప్పటి నుంచి మార్కెట్‌లో ప్రతికూల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. 2019 వరకు ఈ ప్రతికూల ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనా వేశాయి. అప్పటి వరకు ఓల్డ్‌ మాంక్‌ బ్రాండ్‌ మార్కెట్‌లో బతకడం కష్టమని మార్కెట్‌ వర్గాలు భావించాయి. ఈ లోగా అనారోగ్యంతో బాధ పడుతున్న బ్రాండ్‌ యజమాని మోహన్‌ మేకిన్‌ మరణించడం మరో దెబ్బ. 

భారత్‌ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాదాయ వర్గాలే ఎక్కువగా ఓల్డ్‌ మాంక్‌ను ప్రేమించేవారు. ఈలోగా మార్కెట్‌లోకి జానీ వాకర్, బ్లెండర్స్‌ ప్రైడ్, ఇంపీరియల్‌ బ్లూ, రాయల్‌ స్టాగ్‌ లాంటి ఆకర్షణీయమైన బ్రాండులు రావడం, మధ్యాదాయ వర్గాల ఆదాయం కూడా పెరగడం వల్ల వారు ఈ విస్కీ బ్రాండుల వైపు మొగ్గు చూపారని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కొంత వరకు మాత్రమే నిజం కావచ్చు. ఎందుకంటే 24 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ ఆధ్వర్యంలోని మ్యాక్‌డొవెల్‌ రమ్‌ ఏటా 5 శాతం వద్ధిని సాధిస్తూ.. రమ్‌ మార్కెట్‌లో 40 శాతాన్ని ఆక్రమించుకుంది. ఓల్డ్‌ మాంక్‌ కన్నా 20 శాతం తక్కువ ధరకే బ్రాండ్‌ను విక్రయించడం వివిధ క్యాటగిరీల్లో విక్రయించడం వల్ల మ్యాక్‌డొవెల్‌ విజయం సాధించిందని చెప్పవచ్చు. మధ్యలో ప్రస్తుత బ్రాండ్‌ను వదిలేసి ప్రీమియం బ్రాండ్‌కు వెళ్లడం వల్ల ఓల్డ్‌మాంక్‌కు నష్టం జరిగిందనే వారూ ఉన్నారు. ఏదేమైనా భారత ప్రభుత్వ సంస్థ అయినా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు వాటాలు ఉండడం వల్ల మళ్లీ కోలుకుంటుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement