న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మంగుళూరులో జన్మించిన ఫెర్నాండెజ్ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఎన్నో దేశాలు పర్యటించిన ఫెర్నాండెజ్ వియత్నాం దేశం పట్ల అమితమైన అభిమానం చూపేవారు. వారి నిబద్ధతను మెచ్చుకునేవారు. అంతేకాక వియత్నాన్ని సందర్శించిన భారతదేశ తొలి రక్షణశాఖ మంత్రి కూడా ఆయనే. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత)
అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు ఫెర్నాండెజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇలా చెప్పుకోవడానికి నేనేం సిగ్గు పడటం లేదు. మరో జన్మంటూ ఉంటే వియత్నాంలో జన్మించాలని ఉంది. నమ్మిన దాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధంగా ఉంటార’న్నారు. (‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’)
అంతేకాక తాను వియత్నాంలో పర్యటించినప్పుడు.. అమెరికా, చైనా, ఫ్రాన్స్ దేశాలతో ఉన్న వివాదాల కారణంగా దాదాపు 30 లక్షల మంది వియత్నాం వాసులు చంపబడ్డారని తెలిసినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ‘తలసరి ఆదాయంలో వియాత్నం ఇప్పటికి మనకంటే వెనకబడే ఉంది... కానీ ఇన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడగలిగింది’ అని ప్రశంసించారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు వినూత్న ఆలోచనలు చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క వియాత్నం మాత్రమేనని అప్పట్లో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment