
న్యూఢిల్లీ: ఉల్లి ధర చుక్కలనంటుతోంది. దేశ రాజధానిలో కిలో ఉల్లి చిల్లరధర రూ.80 పలుకుతోంది. సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లోనూ రూ. 50 నుంచి 70 దాకా ఉంది. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరఫరా చాలా తగ్గిందని.. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి కూడా పడిపోయింది.
ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్ర లసల్గావ్ మండికి వచ్చే ఉల్లి సరఫరా 47 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో 22,933 క్వింటాళ్ల ఉల్లి అందుబాటలో ఉండగా.. ఇప్పుడు అది 12 వేల క్వింటాళ్లకు తగ్గింది. గతేడాది లసల్గావ్‌లో కేజీ ఉల్లి రూ.7.50కి విక్రయించగా.. ఇప్పుడు రూ. 33కు కిలో చొప్పున విక్రయిస్తున్నారు.