పార్ట్‌టైం ఉద్యోగం కోసమే అక్కడకు... | Only for Part-time jobs | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం ఉద్యోగం కోసమే అక్కడకు...

Published Sat, Dec 26 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

పార్ట్‌టైం ఉద్యోగం కోసమే అక్కడకు...

పార్ట్‌టైం ఉద్యోగం కోసమే అక్కడకు...

♦ భారత్, పాక్, చైనా నుంచి విద్యార్థులు అందుకే వస్తున్నారు..
♦ అమెరికా ప్రభుత్వానికి ఎఫ్‌బీఐ నివేదిక
♦ కాలిఫోర్నియాలో ఉద్యోగాలకు భారీగా డిమాండ్
♦ తక్కువ జీతానికే పనిచేసేందుకు ముందుకు వస్తున్న స్టూడెంట్స్
♦ స్థానికులతో తరచూ ఘర్షణలు.. శాంతిభద్రతల సమస్య
♦ దీంతో గుర్తింపు లేని వర్సిటీలకు వెళుతున్న విద్యార్థుల కట్టడి
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి : భారతీయ విద్యార్థులు ఎక్కువగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంతోపాటు చదువు కంటే పార్ట్‌టైం ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా ప్రభుత్వానికి నివేదించింది. భారత్, పాకిస్తాన్, చైనా నుంచి పెద్ద ఎత్తున కాలిఫోర్నియా రాష్ట్రానికి చదువుల పేరుతో వలస వస్తున్నట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. ఇలా వచ్చిన విద్యార్థుల్లో అత్యధికులు పార్ట్‌టైం ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, వీరి కారణంగా తరచూ శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతున్నాయని ఎఫ్‌బీఐ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ కారణంగానే గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలకు వచ్చే విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ (హోమ్‌ల్యాండ్) అధికారులు కట్టడి చేస్తున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 21 దాకా చైనాకు చెందిన దాదాపు 1,000, పాకిస్తాన్‌కు చెందిన 250, భారత్‌కు చెందిన 49 మంది విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి స్వదేశాలకు తిప్పి పంపారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఈ మూడు దేశాల రాయబార కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ప్రత్యేకంగా ఆర్థిక వనరులు ఉన్నట్లు రుజువులు ఇవ్వలేకపోయిన వారిని, పార్ట్‌టైం ఉద్యోగాల భరోసాతో వస్తున్న వారినే వెనక్కి తిప్పి పంపుతున్నామని వారు వివరించారు.

ఇదే విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా నివేదించింది. చదువుకోవడానికి అవసరమైన పూర్తి ఆర్థిక వనరులు ఉండి, జీఆర్‌ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్‌టీలో మంచి స్కోర్ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఈ నెల రోజుల్లోనే భారత్‌కు చెందిన 19 వేల మంది విద్యార్థులు కాలిఫోర్నియాలోని వివిధ వర్సిటీల్లో అడ్మిట్ అయ్యేందు కు అమెరికా అనుమతించడం గమనార్హం.

 కాలిఫోర్నియానే ఎందుకు?
 అమెరికాలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన కాలిఫోర్నియాలోనే 128 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అమెరికాలోనే మరే రాష్ట్రంలో ఇన్ని వర్సిటీలు లేవు. ఇక్కడ చదివితే పార్ట్‌టైం ఉద్యోగాలతో పాటు ఇంటర్న్‌షిప్ తేలిగ్గా లభిస్తుందని భావించి వేలాది మంది విద్యార్థులు తరలి వెళ్తున్నారు. ఈ ఏడాది ఆగస్టుతో మొదలైన విద్యా సంవత్సరానికి అమెరికాలో చదివేందుకు భారత్ నుంచి 1.34 లక్షల మంది వెళ్లగా.. అందులో 40 వేల మంది కాలిఫోర్నియా వెళ్లారు. వీరు కాకుండా మరో 7 వేల మంది ఎంబీఏ చదివేందుకు ఈ రాష్ట్రంలోని బిజినెస్ స్కూళ్లనే ఎంపిక చేసుకున్నారు. భారత్‌తో పాటు చైనా, పాక్ నుంచి వెళ్లే వారు కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం వైపే మొగ్గుచూపుతున్నారు. 2003 నాటికి కాలిఫోర్నియాలో 67 విశ్వవిద్యాలయాలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 128కి పెరిగింది. ఇందులో గుర్తింపు లేని వర్సిటీలు 22 ఉన్నట్లు అమెరికా గుర్తించినా వాటి జాబితా వెలువరించలేదు.

 పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ఘర్షణలు
 భారత్, చైనా, పాకిస్తాన్ నుంచి ఏటా దాదాపు లక్ష మంది కాలిఫోర్నియాకు వెళ్తున్న దృష్ట్యా అక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. అమెరికా విద్యా చట్టాల ప్రకారం అక్కడ గ్రాడ్యుయేషన్ చేసేవారు ఆ కాలేజీల్లో మాత్రమే పరిమిత గంటల పాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తారు. కానీ అవి కేవలం తెలివైన కొద్ది మంది విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల అత్యధికులు బయట పార్ట్‌టైం ఉద్యోగాలకు ఎగబడుతున్నారు. అతి తక్కువ వేతనానికి పని చేయడానికి ముందుకు వస్తున్న కారణంగా అమెరికా జాతీయులకు పార్ట్‌టైం ఉద్యోగాలు ఇచ్చేందుకు అక్కడి వాణిజ్య, వ్యాపార సంస్థలు వెనకాడుతున్నాయి.

ఈ కారణంగా తరచూ కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో, శాన్‌జోస్, శాంతాక్రూజ్, శాన్‌డిగో వంటి నగరాల్లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఎఫ్‌బీఐ పేర్కొనడం వల్లే విద్యార్థులను కట్టడి చేయడం మొదలుపెట్టారు. ఎంఎస్, ఎంబీఏ చదువు కోసం వెళ్లిన వారు ఖర్చులకు సరిపోక తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్రోల్ బంకులు, హోటళ్లు, వ్యాపార సంస్థల్లో పార్ట్‌టైం ఉద్యోగాలు చూసుకుంటున్నారు. మామూలుగా అమెరికా జాతీయులు గంట పనికి 25 డాలర్లు వసూలు చేస్తారు. కానీ, భారత్, చైనా దేశాల నుంచి వెళ్లిన విద్యార్థులు గంటకు పది అంతకంటే తక్కువ డాలర్లకే పని చేసేందుకు ముందుకు వస్తున్నట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement