
ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
- నల్ల ప్రభుత్వం..నల్ల నిర్ణయమన్న మమత
న్యూఢిల్లీ/కోల్‌కతా: నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించారు. రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నానికి కొందరు ఇబ్బందు పడుతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విమర్శలపై శనివారం జైట్లీ స్పందించారు. నోట్ల మార్పిడికి మరో వారం రోజులు అవకాశం ఇవ్వాలన్న సలహాను ఆయన తోసిపుచ్చారు. ఇలా చేస్తే తమ లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు. వ్యక్తుల సంపాదన న్యాయబద్దమైనదా, కాదా, పన్ను కట్టాడా, లేదా తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, తామదే పని చేస్తున్నామన్నారు. ప్రతిరాష్ట్రంలో ఉప్పు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. దీనిపై వదంతులు నమ్మొదన్నారు. 7వ పేకమిషన్ బకారుులు ఉద్యోగులకు చెల్లించిన కారణంగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు నిల్వలు పెరిగాయన్నారు.
జన్‌ధన్ యోజన అకౌంట్లలో గణనీయంగా డబ్బులు డిపాజిట్ అవుతున్న విషయాన్ని గుర్తించినట్లు జైట్లీ తెలిపారు. కాగా, కేంద్రం తీసుకున్న నోట్ల మార్పిడి నిర్ణయంపై బెంగాల్ సీఎం మమత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నల్ల ప్రభుత్వపు నల్ల నిర్ణయం’ అని ఆమె విమర్శించారు. కోల్‌కతాలో ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులుదీరిన ప్రజలతో ఆమె మాట్లాడారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంంగా జరుగుతున్న పోరులో సీపీఐ (ఎం) సహా అన్ని విపక్షాలతో కలిసి పనిచేస్తామన్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి కావాల్సిన సాయం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలకు సూచించారు.