సగం ఖాతాల్లో డబ్బే లేదు..!
* హెచ్‌ఎస్‌బీసీ ‘నల్ల’ ఖాతాలపై సిట్ నివేదికలో వెల్లడి
* వంద మందికిపైగా పేర్లు రెండుసార్లు ప్రస్తావన
* 300 మందిపై చర్యలకు సమాయత్తమవుతున్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: నల్లధనానికి సంబంధించి 600కు పైగా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు అకౌంట్లలోని సగం ఖాతాల్లో అసలు డబ్బే లేదని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. అలాగే ఈ జాబితాలోని ఖాతాల్లో వంద మందికిపైగా పేర్లు పునరావృతమైనట్టుగా తేల్చింది. మిగిలిన 300 మందికిపైగా ఖాతాదారులపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకునేందుకు ఆదాయపుపన్ను శాఖ యోచిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నల్లధనానికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ జెనీవా బ్రాంచ్‌కు చెందిన 628 పేర్లతో జాబితాను కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పరిశీలించిన సిట్ సుమారు 289 ఖాతాల్లో అసలు డబ్బే లేదని, అలాగే 122 మంది పేర్ల ప్రస్తావన రెండుసార్లు వచ్చినట్టు గుర్తించింది. ఈ ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల వివరాలు లేకపోవడంతో ఈ జాబితాలో ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు పెద్ద అవరోధమని పేర్కొంది. తమకు ఇచ్చిన జాబితాలో ఈ ఖాతాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి.. వాటి కార్యకలాపాల చరిత్ర ఏమిటి అనే వివరాలు లేవని తెలిపింది.
ఇటువంటి ఖాతాల వివరాల జాబితాను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని సిట్ నల్లధనం జాబితాలోని 150 ఖాతాలపై ఐటీ శాఖ పరిశీలన జరిపిందని, అయితే ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఐటీ శాఖ 300 ఖాతాలపై ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. విదేశాల్లో నల్లధనానికి సంబంధించి వివిధ దేశాలతో మరోసారి సంప్రదింపుల ప్రక్రియను పునఃప్రారంభించాలని సిట్ సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రానికి సమర్పించిన నివేదికలోనూ సిట్ ఇదే తరహా సూచన చేసింది.
అయితే విదేశాలతో సంప్రదింపుల ప్రక్రియను ఇప్పటికే పునఃప్రారంభించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సిట్‌కు తెలిపింది. మరోవైపు స్విస్ బ్యాంకులకు సంబంధించిన ఖాతాల వివరాలను స్వ యంగా వెల్లడించినట్లయితే వారికి తక్కువ శిక్ష పడేలా చేస్తామన్న సీబీడీటీ సూచనను సిట్ సమర్థించింది. నల్లధనంపై ప్రజలు తెలిసిన సమాచారాన్ని తెలియజేయాలని ఇటీవల కోరిన సిట్.. దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి త్వరలోనే ప్రజలకు తెలియజేయనుంది.