అఖిలేశ్ గుర్తుంచుకో.. ఒవైసీ నిప్పులు!
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై నిప్పులు చెరిగారు. అజంగఢ్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు తనకు అధికారులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. యూపీలోని మరిన్ని పర్యటనలు చేస్తానని సవాల్ విసిరారు.
'అజంగఢ్‌లో ప్రవేశించకుండా, బహిరంగ సభలు నిర్వహించకుండా సమాజ్‌వాదీ పార్టీ నన్నుఅడ్డుకుంటోంది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అఖిలేశ్ గుర్తుంచుకోవాలి. నేను మరిన్ని పర్యటనలు చేయబోతున్నా' అని ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ముబారక్‌పూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అజంగఢ్‌లో బహిరంగ సభకు ఒవైసీ పెట్టుకున్న అభ్యర్థనను జిల్లా కలెక్టర్ సుహాస్ తిరస్కరించారు. 'భారత్ మాతకీ జై' అనబోనని ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని, ఆయన పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హిందూ యువ వాహిని హెచ్చరించింది. ఒవైసీ రాకకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన ఆ గ్రూప్ కార్యకర్తలు వందమందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ కూడా ఒవైసీ జిల్లాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. యూపీలో మత ఉద్రిక్తతలు పెంచేందుకే ఒవైసీకి ఎస్పీ ప్రభుత్వం మద్దతు పలుకుతున్నట్టు ఆరోపించారు. వచ్చే ఏడాది జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టిన ఒవైసీ.. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో సత్తా చాటాలని భావిస్తున్నారు. తరచూ యూపీలో పర్యటనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.