రామోజీ, రజనీలకు ‘పద్మ’ ప్రదానం
యార్లగడ్డ, రాజమౌళి, సానియా సహా 56 మందికి అందచేసిన రాష్ట్రపతి ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ అవార్డుల మలివిడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం వైభవంగా జరిగింది. మొత్తం 56 మందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డుల్ని అందచేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 11 మందికి పద్మ భూషణ్, 40 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. ఆరుగురు తెలుగువారు పద్మ పురస్కారాల్ని స్వీకరించారు. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు పద్మవిభూషణ్, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలు పద్మభూషణ్‌ను అందుకోగా.. వైద్యుడు మన్నం గోపీచంద్, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిలు పద్మశ్రీని స్వీకరించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఆర్‌డీవో మాజీ చీఫ్ వీకే ఆర్త్రే, ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, చెన్నై కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్ వి.శాంతలకు కూడా రాష్ట్రపతి పద్మవిభూషణ్‌ను అందచేశారు. అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ డి బ్లాక్‌విల్, దాత, విద్యావేత్త ఇందూ జైన్, మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ, గాయకుడు ఉదిత్ నారాయణ్, మణిపురి రచయిత హైస్నం కన్హయ్‌లాల్, ఆధ్యాత్మిక వేత్త దయానంద సరస్వతి(మరణానంతరం), ప్రఖ్యాత శిల్పి రామ్ వంజి సుతార్, భారతీయ చరిత్ర పరిశోధకుడు ఎన్.రామానుజ తాతాచార్య, చిన్మయ మిషన్ అంతర్జాతీయ విభాగ అధిపతి స్వామి తేజోమయానందలకు పద్మభూషణ్‌ను అందచేశారు.
పద్మశ్రీలు.. పద్మశ్రీ అవార్డు అందుకున్నవారిలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, ఎడిటర్స్ గిల్డ్ మాజీ చీఫ్ ధీరేంద్ర నాథ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.
పురస్కార గ్రహీతలకు సత్కారం
పద్మ పురస్కార గ్రహీతలకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో తేనీటి విందు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. పురస్కార గ్రహీతల్ని విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కూడా తన నివాసంలో సత్కరించారు. రామోజీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మన్నం గోపిచంద్, సునీతా కృష్ణన్‌లు పాల్గొన్నారు.
బాధ్యత మరింత పెంచింది: సునీతా కృష్ణన్
అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఇది నా పోరాటానికి గుర్తింపు. అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. దేశంలో ఆడపిల్లలు, మహిళలు అమ్ముడుపోకుండా ఉండడ మే నా పోరాట లక్ష్యం.
అధికారభాషా చట్ట అమలుకు కృషి: యార్లగడ్డ
ఏ భాషా సంస్కృతుల వల్ల ఈ స్ధాయికి చేరానో వాటి అభివృద్ధికి కృషి చేస్తా. ఏపీలో అధికార భాషా చట్టం అమలుకు జీవితాంతం కార్యకర్తలా పని చేస్తా. తెలుగుకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ఇచ్చినా.. సంబంధిత కేంద్రాన్ని ఇంకా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోలేక పోయాం.
మరింత ఉత్సాహంతో సేవ చేస్తా: మన్నం
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంతో కేన్సర్ బాధితులకు సేవ చేస్తా.
సంకల్పం బలపడింది: రామోజీ
ఆఖరి వరకూ ప్రజాసేవలోనే తరించాలన్న నా నిశ్చయాన్ని ఈ అవార్డు మరింత బలపర్చింది. అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ పట్ల ఉన్న నిబద్ధత చాటుకుందని భావిస్తున్నా. పాత్రికేయ వృత్తి పట్ల నాకున్న అభిరుచి ఇంతటి గౌరవానికి అర్హుడ్ని చేయడం అంతులేని ఆనందాన్నిచ్చింది.
చెప్పలేని అనుభూతి : రాజమౌళి
పద్మశ్రీ అందుకోవడం చెప్పలేని అనుభూతి కలిగించింది. రజనీకాంత్, రామోజీరావులతో పాటు అవార్డు అందుకోవడం గొప్పగా ఉంది. దీనిపై మాట్లాడేందుకు పదాలు లేవు.