పాకిస్తాన్ శాశ్వత శవాసనానికి అర్హురాలు!
యోగా కార్యక్రమంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తేవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రశంసలు కురిపించింది. అయితే శరీరంలోని రుగ్మతలను తొలగించే యోగా.. ప్రజలు బాధపడుతున్న అధిక ద్రవ్యోల్బణం, అవినీతి నొప్పులు తగ్గించడానికి పనికిరాదని, యోగాలోని శవాసనానికి పాకిస్తాన్ శాశ్వత అర్హురాలంటూ శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది.
ప్రపంచానికే సెంటర్ స్టేజ్ గా యోగాను తీసుకురావడంతోపాటు, 130 దేశాల్లో యోగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మెచ్చుకోదగ్గ విషయం అని శివసేన ప్రశంసించింది. యోగా ద్వారా 130 దేశాలు నడుం వంచాయని, మోడీ కృషితో అన్ని దేశాలనూ నేలపై పడుకొనేట్లు చేయగలిగారని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అటువంటి యోగాసనానికి శాశ్వత అర్హురాలంటూ శివసేన చురక వేసింది. అలా జరగాలంటే కేవలం ఆయుధాలతోనే సాధ్యమౌతుందంటూ విమర్శలు చేసింది. శవంలా నేలపై పడుకొనే యోగాసనమైన 'శవాసనం' యోగాలో ప్రముఖమైనది. ఆ ఆసనంలాగానే పాకిస్తాన్ ను చేయాలని శివసేన తన పార్టీ పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో పేర్కొంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాలు మోదీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయితే యోగా కూడ సైన్సేనని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా మతపరమైన, ధార్మిక కార్యక్రమం కాదని, ఇండియాలోనే కాక ఇతర దేశాల్లోనూ లక్షలమంది వివిధ ఆసనాల్లో రెండవ ప్రపంచ యోగాదినాన్ని ఘనంగా జరుపుకున్నారని శివసేన తెలిపింది. అయితే భారత్ లో అవినీతి రూపు మాపేందుకు తాము చేపడుతున్న చర్యలపై దోహాలో ప్రధాని మోదీ వివరించిన తీరును తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించిన శివసేన, విదేశీ గడ్డపై భారత్ పటిష్టను మంటగలపొద్దని సూచించింది.