
ఐఎస్ఐ కూడా ఐఎస్ఐఎస్ మాదిరిగానే..
మీరట్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధ మాదిరిగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా ఐఎస్ఐ అనుమానిత ఏజెంటు మహ్మద్ ఇజాజ్ వెల్లడించాడు. అతడిని భారత స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇజాజ్ను విచారిస్తున్న పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి.
భారత్లో గూఢచర్యం నిర్వహించడానికి ఇజాజ్కు 9 నెలల పాటు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. శిక్షణలో సమాచారాన్ని సేకరించడం, చేరవేయడంలో అతన్ని ఆరితేరేలా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ గుండా అతన్ని భారత్కు అక్రమంగా పంపినట్లు తేలింది. ఇజాజ్ను భారత్కు పంపే సమయంలో అతని పాస్పోర్ట్ను ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కూడా తామ సంస్థలో చేరిన సభ్యుల పాస్పోర్ట్లను కాల్చివేసి వారిని తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటుంది.
అలాగే అజీజ్కు నెలకు 50 వేల రూపాయల జీతంతో పాటు, చెల్లి పెళ్ళికి సహాయం అందిస్తామని నమ్మించి తరువాత ఆ వాగ్దానాలను ఐఎస్ఐ నిలుపుకోలేదని ఇజాజ్ విచారణలో తేలిందని డీఎస్పీ అనిత్ కుమార్ వెల్లడించారు. ఇజాజ్ స్కైప్ ద్వారా ఐఎస్ఐతో తన సంభాషణలు కొనసాగించాడని తేలింది. అయితే అతడు పాక్కు ఎలాంటి సమాచారాన్నిచేరవేశాడనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.