- సరిహద్దుల్లోని 13 ఔట్ పోస్టులపై భారీగా కాల్పులు
జమ్మూ: కొంతకాలంగా తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్.. మళ్లీ తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై పాకిస్తాన్ బలగాలు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాయి. గత ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. అయితే పాకిస్తాన్ బలగాలకు భారత సేనలు దీటుగా బదులిచ్చాయి.
ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ రేంజర్లు మృతిచెందినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ దళాలు బుధవారమే విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారత దళాలు దీటుగా స్పందించి, ఎదురుకాల్పులు జరపడంతో... పాకిస్తాన్‌కు చెందిన నలుగురు రేంజర్లు కూడా మరణించారు. ఇది జరిగిన కొద్ది గంటలలోపే పాక్ దళాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి.
బుధవారం రాత్రంతా సాంబా సెక్టార్‌లోని 13 సైనిక ఔట్‌పోస్టులపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపినట్లు బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ వెల్లడించారు. దీనికి ప్రతిగా బీఎస్‌ఎఫ్ దళాలు కూడా కాల్పులు జరిపాయని... గురువారం ఉదయం 6 గంటల వరకు కాల్పులు కొనసాగాయని ఆయన చెప్పారు.
ఈ విషయంలో గట్టిగా ప్రతిస్పందిస్తామన్నారు. అయితే ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌లోకి చొరబడడానికి అంతర్జాతీయ సరిహద్దు వద్ద యాభై, అరవై మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని రాకేశ్‌శర్మ చెప్పారు. సరిహద్దుల వెంట భారత భూభాగంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.