బాలీవుడ్లో ఇటీవల సంచలనం సృష్టించిన భజరంగీ భాయ్జాన్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ భారత్లో చిక్కుకుపోయిన ఓ పాకిస్తానీ మూగ బాలికను తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. అలాంటి సన్నివేశమే ఇండియా-పాక్ బార్డర్లో జరిగింది. కాకపోతే ఇక్కడ మాత్రం పాక్ నుండి భారత్లోకి వచ్చిన ఓ బాలుడిని భారత జవాన్లు పాక్కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే... జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పురా సెక్టార్లో అంతర్జతీయ సరిహద్దు రేఖ వద్ద అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన ఓ బాలున్నిగుర్తించారు.
బాలున్ని విచారించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అతని వివరాలు తెలుసుకోగా.. తన పేరు రివాన్గా తెలిపిన బాలుడు తన తండ్రి పేరు అమిన్ అలీ అనీ.. సరిహద్దు ప్రాంత పాక్ గ్రామానికి చెందిన వాడిగా చెప్పుకున్నాడు. ఇతర వివరాలు సేకరించిన బీఎస్ఎఫ్ అధికారులు రివాన్ ఎలాంటి నేరపూరిత ఉద్దేశంతో సరిహద్దు దాటలేదని నిర్ధారించుకున్నారు. అనంతరం పాకిస్తాన్ రేంజర్లకు సమాచారం అందించిన బీఎస్ఎఫ్ అధికారులు బుధవారం సాయంత్రం బాలున్ని పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. రివాన్ విచారణలో సరిహద్దు ప్రాంతంలో డ్యాన్స్ ట్రూప్లో మెంబర్గా పనిచేసేవాడనీ.. మెరుగైన జీవనోపాధికోసం భారత్కు వచ్చినట్లు తెలిపాడు.