న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ పోస్టులు, గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్‌కు భారత్ దీటైన జవాబిచ్చింది. శనివారం బీఎస్‌ఎఫ్ బలగాలు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆరు పోస్టులను ధ్వంసం చేయడంతో పాటు నలుగురు రేంజర్లను హతమార్చాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ సహా నలుగురు శనివారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
దీంతో బీఎస్‌ఎఫ్ తాజా దాడితో పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ స్పందిస్తూ.. ‘భారత్‌లోకి ఉగ్రవాదుల్ని పంపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాక్‌కు అలవాటుగా మారాయి. ఆ దేశానిది వక్రబుద్ధి. పాక్ పేల్చే ఒక్కో బుల్లెట్‌కు భారత్ 10 బుల్లెట్లతో సమాధానమిస్తుంది’ అని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలను పాక్ లక్ష్యంగా చేసుకోవడంతోనే తాము తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పాక్ కాల్పుల్లో నలుగురు మృతి
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట పాక్ బలగాలు శనివారం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 18 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారుల హెచ్చరికతో దాదాపు 35,000 మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వెయ్యిమందికి అధికారులు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 300 స్కూళ్లతో పాటు పలు విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది. పాక్ కాల్పుల్లో పంజాబ్‌లోని ఆలంపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ మన్‌దీప్ సింగ్ మృతి చెందినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment