పాక్ పై భారతే ఫేవరేట్: అఫ్రిది
పాక్ పై భారతే ఫేవరేట్: అఫ్రిది
Published Fri, Jun 2 2017 9:08 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో జరిగే పాక్-భారత్ మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్ అని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. కానీ పాకిస్థానీగా తమ జట్టే గెలవాలని ప్రత్యేకంగా భారత్‌పై విజయం సాధించాలని కోరుకుంటానని ఆఫ్రిది తెలిపాడు. గత కొద్ది రోజులుగా భారత ఆటతీరును పరిశీలిస్తే భారత జట్టు బలంగా ఉందని ఆఫ్రిది ఐసీసీకి రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.
భారత్‌ను కట్టడి చేసే సత్తా పాక్ బౌలర్లకు ఉందన్నాడు. భారత జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్ అయిన విరాట్ కోహ్లీని తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే పాక్ విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మట్లలో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని, 2012 ఆసీయా కప్‌లో పాక్‌పై కోహ్లీ చేసిన సెంచరీ తననేంతో ఆకట్టుకుందని ఆఫ్రిది గుర్తుచేసుకున్నాడు. అయితే కోహ్లీ పాక్ బౌలర్ల చేతిలో చాల సార్లు విఫలమయ్యాడన్న విషయం కూడా పాక్ ఆటగాళ్లు గుర్తుకు తెచ్చకోవాలన్నాడు. ఇది పాక్ కలిసొచ్చే అంశమని అఫ్రిది పేర్కొన్నాడు.
భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగం బలంగా ఉండటం సంప్రదాయకంగా వస్తుందేనని, ఈ మధ్యలో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారిందని అఫ్రిది చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అశ్విన్, జడేజాల బంతులను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌లకు చాల కష్టమని తెలిపాడు. ఇంగ్లండ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించకున్న వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తారని కితాబిచ్చాడు . భువనేశ్వర్, షమీ, బుమ్రా, యూసఫ్‌లతో ఫేస్ విభాగం కూడా బలంగా ఉందని అఫ్రిది పేర్కొన్నాడు. బూమ్రా డెత్ ఓవర్లలో పదునైన యార్కర్లతో రాణించడం..1990 లోని పాక్ బౌలర్లును గుర్తు చేస్తోందని అభిప్రాయపడ్డాడు.
Advertisement
Advertisement