
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభలు దద్దరిల్లే అవకాశముంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. గత సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా, ఏపీకి విభజన హామీల అమలు విషయంలో ఉదాత్తమైన పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేయడమే కాదు.. చివరకు వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమోదింపచేసుకున్నారు. పదవులకు కన్నా ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మరోసారి వైఎస్సార్ సీపీ ఎంపీలు చాటారు.