
ఆ ఎమ్మెల్యేల మొహాలు వెలిగిపోయాయి!
బిహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం అత్యంత సంతోషంగా కనిపించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం అత్యంత సంతోషంగా కనిపించారు. అధికార, విపక్ష సభ్యులన్న తేడా లేకుండా అందరి మొహాలు మతాబుల్లా వెలిగిపోయాయి. కారణం ఏమిటంటే ఎమ్మెల్యేలు అందరికీ గిఫ్ట్ లు పంచారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులకు మైక్రో ఓవెన్లు, సూట్ కేసులు, బ్యాగులు అందజేశారు.
బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యేలకు ప్రతి శాఖ వివిధ బహుమతులు ఇవ్వడం బిహార్ లో రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. మైక్రో ఓవెన్లను కానుకలుగా ఇచ్చిన విద్యాశాఖ వీటికోసం రూ.30 లక్షలు వెచ్చించింది. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌధురి తెలిపారు. దీనిపై స్పందించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిరాకరించారు. ఎమ్యెల్యేలకు గిఫ్ట్ లు ఇస్తే తప్పేంటని డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు.
'బిహార్ వెనుకబడిన రాష్ట్రం. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా కోటీశ్వరులు కాదు. పేదలు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి కొన్ని కానుకులు ఇస్తే తప్పేంటి. ఈ విషయాన్ని పెద్దది చేయొద్ద' అని సూచించారు. అన్ని శాఖలు కలిపి ఒకే రకమైన కానుక ఇస్తే బాగుంటుందని గతంలో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.