'నా కుమారుడిని ఎవరు చంపారో తెలుసు'
పాట్నా: తన కుమారుడిని ఎవరు హత్య చేశారో ప్రజలందరీకి తెలుసని ఇటీవల బిహార్లో దారుణ హత్యకు గురైన రాజ్‌దేవ్ రంజన్ తండ్రి రాధాకృష్ణ చౌదరీ అన్నారు. ఒక్క సీబీఐ దర్యాప్తు మాత్రమే తన కుటుంబానికి న్యాయం చేయగలదని చెప్పారు. ఈ హత్య వెనుకగల కారణాలు అందరికీ తెలుసన్నారు. సీనియర్ పాత్రికేయుడైన రాజ్‌దేవ్ రంజన్‌ను శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. రాజ్‌దేవ్ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్'లో బ్యూరో చీఫ్ గా 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
సివాన్ రైల్వేస్టేషన్ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. ఈ హత్యపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. 'బిహార్ జంగల్ రాజ్ నుంచి మహా జంగల్ రాజ్'గా మారిందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి రాధాకృష్ణ స్పందించారు. 'మాకు స్థానిక పోలీసులు.. రాష్ట్ర పాలక వర్గంపై ఏ మాత్రం విశ్వాసం లేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే. సివాన్ ప్రాంత ప్రజలందరికీ ఈ హత్య వెనుక ఎవరున్నారో తెలుసు' అని ఆయన చెప్పారు.