
సాక్షి, ముంబై : ప్రాణం కన్నా మనిషికి మనీయే ముఖ్యమనే రోజులు దాపురించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ట్రక్ డ్రైవర్ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే.. ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. తేరగా వచ్చేది వదులుకుంటామా అని దొరికినన్ని ఉల్లిపాయల్ని దోచుకెళ్లారు. విషాదమేంటంటే.. అటుగా వెళ్తున్న ఇతర ట్రక్ డ్రైవర్లు సైతం గాయపడిన క్షతగాత్రునివంక కన్నెత్తి చూడలేదు. అందరూ అతని వాహనంలోని ఉల్లిపాయల్ని దోచుకునే పనిలో పడ్డారు. ఈ ఘటన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై గల వాల్వన్ బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
అదృష్టవశాత్తూ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పిందని, చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గురైన వాహనం ఉల్లిపాయల లోడుతో ముంబై నుంచి పుణె వెళుతోందని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్ ఢీకొట్టి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి వాహనం కిందపడడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment