చార్‌ధామ్‌లో ఇరుక్కున్న జగిత్యాలవాసులు
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన సుమారు 150 మంది యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. అయితే, వారంతా క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి బంధువులకు సమాచారం అందించారు. జగి త్యాలకు చెందిన అర్వపల్లి రాజేశం ఆధ్వర్యంలో 74 మంది యాత్రకు వెళ్లగా, అలాగే అంబుదాస్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో మరో 50 మంది వెళ్లారు. గత మే 5న వెళ్లిన వీరు ఈనెల 28న తిరిగి రావాల్సి ఉంది. అయితే, కేదారినాథ్‌కు వెళ్తుండగా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో అంతరాయం ఏర్పడింది.
రాక పోకలు స్తంభించిపోయాయి. దీంతో వారు హతిపహాడ్‌లోని చిన్న జీయర్‌స్వామి ఆశ్రమానికి చేరినట్లు తెలిసింది. ఇందులో జగిత్యాల, కరీంనగర్, ధర్మపురి, బీర్‌పూర్, సారంగాపూర్ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. ఓ ఆశ్రమంలో చిక్కుకున్నారన్న సమాచారంతో ఇక్కడి బంధువులు ఆందోళనకు గురయ్యారు. మే 5న అమ్మనాన్న పల్లెర్ల కిషన్ (68), భారతి (59) యాత్ర కోసం వెళ్లారు. కొండచరియలు విరగడంతో వారు ఆ ప్రాంతంలో ఉండిపోయారు.